తెలంగాణలో చైతన్యపురిలోని ఓ ఆసుపత్రిలో రాత్రి 9 గంటలకు ఓ వ్యక్తి(53) కరోనాతో మృతి చెందారు. శ్మశానవాటికలన్నీ మూసేయడంతో శవాన్ని ఎక్కడుంచాలో తెలియని పరిస్థితి. ఒక స్వచ్ఛంద సంస్థను సంప్రదించి అంబులెన్సు, ఫ్రీజర్ మాట్లాడారు. రూ.40 వేలతో మొదలైన బేరం చివరికి రూ.32 వేలకు తెగింది. తీవ్ర దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ఆ రాత్రి తీరని వేదన తప్పలేదు.
కరోనా కాటేస్తున్నా..
కల్లోలం సృష్టిస్తున్నా.. కాసుల వేటను వదల్లేదు మనిషి! కళ్లముందే జనం పిట్టల్లా రాలిపోతున్నా.. కన్నీళ్లనూ పిండుకుని జేబు నింపుకోలానుకుంటున్న అమానవీయతను చూసి బహుశా ఆ మహమ్మారే విస్తుపోతోందేమో!! రాజధాని సహా అనేక జిల్లాల్లో కొవిడ్ మృతదేహాల్ని ఆసుపత్రి నుంచి శ్మశానానికి తరలించేదాకా అడుగడుగునా అగచాట్లే. ఒక్కో శవం కాష్టం చేరేందుకు కనీసం రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా చేతిలో ఉండాల్సిందే. ప్రైవేట్ అంబులెన్సులు, దళారులు ఆసుపత్రుల ముందే ఈ దందాకు తెరలేపుతున్నారు.
గతేడాది హైదరాబాద్‌తో కరోనాతో మృతి చెందినవారికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోనే అంత్యక్రియలను నిర్వహించేవారు. ఈసారి కొన్ని ప్రభుత్వాసుపత్రుల నుంచి మాత్రమే శవాల్ని తరలిస్తోంది. మిగతాచోట్ల మృతుల్ని కుటుంబ సభ్యులకే వదిలేస్తోంది. ఇదే అవకాశంగా దళారీలు బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి రూ.25 వేలకు తగ్గకుండా వసూలు చేస్తున్నారు. గ్రేటర్‌లో మూడు శ్మశానాల్లో అధికారికంగా కొవిడ్ మృతుల అంత్యక్రియలు చేస్తున్నారు. మిగతావాటిలో స్థానిక ఎమ్మెల్యే నుంచి సిఫార్సు ఉంటేనే అనుమతిస్తున్నట్లు సమాచారం.
*నగరంలో కొవిడ్ మృతులకు ఫీడ్ ద నీడీ స్వచ్ఛంద సంస్థ ఉచితంగా అంత్యక్రియలు చేస్తోంది. వివరాలకు 79954 04040 నంబరులో సంప్రదించవచ్చు.
ప్రత్యామ్నాయం చూపించండి