ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MEDICINE PRICE: మందుల ధరలకు కళ్లెం..30-40 శాతం వరకు తగ్గింపు - ఎన్​పీపీఏ వార్తలు

MEDICINE PRICE: మందుల ధరలకు ముక్కుతాడు వేస్తూ.. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. రక్తపోటు, మధుమేహం, జీర్ణాశయ సమస్యలు, కొలెస్ట్రాల్‌, గుండెపోటు, పక్షవాతం, నొప్పి నివారణలకు వాడే ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ఫలితంగా వినియోగదారులపై 30-40 శాతం మేర భారం తగ్గనుంది

MEDICINE PRICE
MEDICINE PRICE

By

Published : Jul 6, 2022, 11:21 AM IST

MEDICINE PRICE: మధుమేహం, అధిక రక్తపోటు.. 40 ఏళ్లు దాటాక సుమారు 60 శాతం మందిలో ఈ రెండింటిలో ఒకటైనా కనిపిస్తోంది. ఒక్కసారి వీటి బారిన పడితే జీవితాంతం మందులు వాడాలి. వీటి ఖర్చు మధ్యతరగతి ప్రజలకు భారమే. దీన్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) మందుల ధరలను సవరిస్తూ.. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో రక్తపోటు, మధుమేహం, జీర్ణాశయ సమస్యలు, కొలెస్ట్రాల్‌, గుండెపోటు, పక్షవాతం, నొప్పి నివారణలకు వాడే అతి ముఖ్యమైన ఔషధాలున్నాయి. ఫలితంగా వినియోగదారులపై 30-40 శాతం మేర భారం తగ్గనుంది. సవరించిన ధరల మేరకే ఆయా మందులను అమ్మాలని ఉత్పత్తి సంస్థలను ఎన్‌పీపీఏ ఆదేశించింది. ఇవే ఔషధాలను వేర్వేరు ఫార్ములాలతో కొత్తగా విపణిలోకి తేవాలనుకుంటే.. ప్రభుత్వ అనుమతి పొందాలని స్పష్టం చేసింది. దీంతో కొత్త ఔషధం పేరిట మందులను ఇష్టానుసారంగా విక్రయించకుండా అడ్డుకట్ట వేసినట్లయ్యింది. ఎక్కువగా సమ్మిళిత ఔషధాల (కాంబినేషన్‌ డ్రగ్స్‌) ధరలకు ముకుతాడు వేసింది.

ధరల పట్టికను ప్రదర్శించాలి

ఔషధ ఉత్పత్తి సంస్థలు నిర్ణీత ధరలను కచ్చితంగా పాటించాలని, లేకుంటే వడ్డీతో పాటు అధిక మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఎన్‌పీపీఏ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ‘ఇంటిగ్రేటెడ్‌ ఫార్మాస్యూటికల్‌ డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐపీడీఎంఎస్‌)’ ద్వారా ధరల జాబితాను సమర్పించాలని ఔషధ తయారీదారులను కోరింది. ప్రతి రిటైలర్‌, డీలర్‌ ఔషధ ధరల జాబితాను, అనుబంధ ధరల జాబితాను వ్యాపార ప్రాంగణంలో స్పష్టమైన భాగంలో ప్రదర్శించాలి. మరో ప్రత్యేక ప్రకటనలో లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ అండ్‌ ఆక్సిజన్‌ ఇన్‌హేలేషన్‌ (ఔషధ వాయువు) సవరించిన సీలింగ్‌ ధరను ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకూ పొడిగించినట్లు ఎన్‌పీపీఏ తెలిపింది.

ధరలు సవరించిన మందుల్లో కొన్ని..

* సిప్లా, ప్యూర్‌ అండ్‌ కేర్‌ హెల్త్‌కేర్‌ తదితర సంస్థలు విక్రయిస్తున్న అటోర్వాస్టాటిన్‌, ఫెనోఫైబ్రేట్‌ మాత్ర ధర ఒక్కోటి రూ.13.87గా నిర్ణయించింది. ఈ మందులను గుండె, మధుమేహ రోగులు వినియోస్తారు.

* అకుమ్స్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌, జర్మన్‌ రెమెడీస్‌ ఫార్మాస్యూటికల్స్‌ విక్రయిస్తున్న ‘ఒల్మెసార్టన్‌ ప్లస్‌ మెడోక్సోమిల్‌ ప్లస్‌ అమ్లోడిపైన్‌ ప్లస్‌ హైడ్రోక్లోరోథియాజైడ్‌’.. ఔషధాన్ని గుండె, రక్తపోటు వ్యాధులకు ఉపయోగిస్తారు. దీని చిల్లర ధరను ఒక్కో మాత్రకు రూ.12.91గా స్థిరీకరించింది.

* వొగ్లిబోస్‌ అండ్‌ (ఎస్‌ఆర్‌) మెట్‌ఫార్మిన్‌ హైడ్రోక్లోరైడ్‌ ఒక్కో మాత్ర ధరను రూ.10.47గా నిర్ణయించింది.

* పారాసిటమాల్‌, కెఫిన్‌ల ధరను ఒక్కో మాత్రకు రూ.2.88గా నిర్ణయించింది.

* రోసువాస్టాటిన్‌ ఆస్పిరిన్‌, క్లోపిడోగ్రెల్‌ క్యాప్సూల్‌ ధరను ఒక్కో దానికి రూ.13.91గా స్థిరీకరించింది.

* నొప్పి నివారణకు ఉపయోగించే పారాసిటమాల్‌, ఐబూప్రొఫెన్‌ సస్పెన్షన్‌ ధరను ఒక్కో మిల్లీలీటరు(ఎంఎల్‌)కు రూ.0.33గా నిర్ణయించింది.

* శ్వాసకోశ, ఇతర ఇన్‌ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్‌గా వినియోగించే ‘అమోక్సిసిలిన్‌ అండ్‌ పొటాషియం క్లావులనేట్‌ ఐపీ’ ఒక్కో మాత్ర ధర రూ.34.03గా పేర్కొంది. ఇదే కాంబినేషన్‌లో ఓరల్‌ సస్పెన్షన్‌కు ఒక్కో ఎంఎల్‌కు రూ.3.90గా ధరను స్థిరీకరించింది.

* రక్తహీనతను తగ్గించడానికి వినియోగించే ఫెర్రస్‌ అస్కార్‌బేట్‌ అండ్‌ ఫోలిక్‌ యాసిడ్‌ ఓరల్‌ డ్రాప్స్‌ గరిష్ఠ చిల్లర ధరను ఒక్కో ఎంఎల్‌కు రూ.5.06గా నిర్ణయించింది.

* నొప్పి, వాపులు తగ్గించడానికి వినియోగించే అసెక్లోఫినాక్‌ అండ్‌ పారాసిటమాల్‌, ట్రిప్సిన్‌, క్రైమోట్రిప్సిన్‌ కాంబినేషన్‌లో వచ్చిన మందు ఒక్కో మాత్ర ధర రూ.13.85గా స్థిరీకరించింది.

* క్లోపిడొగ్రెల్‌ అండ్‌ ఆస్పిరిన్‌ మాత్రలను గుండెజబ్బులు, మధుమేహ రోగులు వినియోగిస్తారు. ఈ మాత్ర ధర ఒక్కో దానికి రూ.4.34గా నిర్ణయించింది.

* కాల్షియం కార్బోనేట్‌, కాల్షిట్రోల్‌ అండ్‌ జింక్‌ క్యాప్స్యూల్‌ను ఎముకల బలానికి వినియోగిస్తుంటారు. ఒక్కో క్యాప్స్యూల్‌ ధరను రూ.14.07గా నిర్ణయించింది.

* సెఫ్‌ట్రైయాక్సిన్‌ అండ్‌ టాజోబాక్టమ్‌ ఇంజక్షన్‌ను శస్త్రచికిత్సల అనంతరం, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉన్నప్పుడు వినియోగిస్తారు. దీని ధర ఒక్కో ఇంజక్షన్‌కు రూ.168.43గా నిర్ణయించింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details