ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జ్వరం, దగ్గు ఉంటే.. కరోనా సోకినట్టు కాదు!

అసలే కరోనా. ఆపై వానాకాలం. ఇప్పుడు ప్రజల్లో ఆందోళనలు రెట్టింపు కావటానికి కారణమిదే. సాధారణంగానే వర్షాకాలంలో రకరకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. డెంగీ, మలేరియా లాంటివి చాలామందిని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇప్పుడు వీటికి కరోనా తోడవటం వల్ల అందరూ భయ పడిపోతున్నారు. ఏది కరోనా లక్షణమో... ఏది కాదో అన్నది తేల్చుకోలేని స్థితి. అసలు ఏ లక్షణాలూ లేకుండానే కరోనా సోకుతుందన్నది ఎంత నిజమో... ఏ ఇద్దరిలోనూ ఒకే లక్షణాలు కనిపించకుండా వైరస్ వ్యాప్తి చెందుతోందన్నదీ అంతే వాస్తవం. అందుకే.. కాస్త నలతగా అనిపించినా వెంటనే అది కరోనా అనే నిర్ధరణకు వస్తున్నారు. అసలు లక్షణాలు ఎలా గుర్తించాలి..? వాతావరణ మార్పుల నేపథ్యంలో ఏది కరోనా లక్షణమో.. ఏది కాదో ఎలా తెలుసుకోవాలి?

By

Published : Jul 11, 2020, 5:22 PM IST

dengue symptoms
డెంగీ లక్షణాలు

అవి డెంగీ లక్షణాలు కావొచ్చు

రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్‌ నుంచి ఎవరికి వారు తప్పించుకునేందుకు మాస్క్‌లు ధరించడం, చేతులను శానిటైజ్‌ చేసుకోవడం తదితర జాగ్రత్తలు పాటిస్తున్నారు. కొవిడ్‌-19 ఎప్పటికి నియంత్రణలోకి వస్తుందో నిపుణులు సైతం చెప్పలేని పరిస్థితి. ఇంతలో వానాకాలం రానే వచ్చింది. ఇప్పుడు సీజనల్‌ వ్యాధుల భయం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. స్వీయ జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. స్వీయ సంరక్షణ తప్ప ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ఏ మందూ లేదు.

మొన్నటి వరకు ఓ ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తు. వానాకాలం ప్రారంభమైంది. కరోనా వైరస్‌ విజృంభణకు అనుకూల సమయమిది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. నిబంధనలు పాటించక పోయినా అనారోగ్యాలు దరిచేరటం ఖాయం. సాధారణంగానే వానాకాలం అంటే వ్యాధుల సీజన్‌గా పేర్కొంటారు. ఈ కాలంలో జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వస్తుంటాయి. కరోనాకు సైతం ఇవే లక్షణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది చిన్నపాటి జలుబు, దగ్గుకు భయ పడుతున్నారు. నలుగురిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరికి చిన్నగా తుమ్ము, దగ్గు వచ్చినా మిగతా వారు అనుమానపడుతున్నారు.

ఆ ప్రదేశాల్లోనే ఎక్కువ సేపు వైరస్ బతికి ఉంటుంది

తేమగా ఉండే వాతావరణంలో కరోనా వైరస్‌ ఎక్కువ సేపు జీవించి ఉంటుందని గతంలోనే పలువురు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వానాకాలంలో సహజంగానే తేమశాతం ఎక్కువ ఉంటుంది. అందుకే... కరోనా ఉద్ధృతి పెరిగే ప్రమాదం లేకపోలేదు. రహదారులపై ప్రయాణించే వారు ఉన్నట్టుండి వర్షం పడితే తమకు సమీపంలోని చెట్లు లేదా ఏదైనా షెల్టర్‌లో కాసేపు తల దాచుకుంటారు. అలాంటి చోట్ల భౌతిక దూరం పాటించడం కుదరదు. అలాగే మాస్కులు తడిసి పోతే... జలుబు వచ్చే అవకాశాలూ ఎక్కువే. అది క్రమంగా జ్వరంగా మారవచ్చు. ఇలాంటప్పుడే అది ఏ వ్యాధి లక్షణమో తెలుసుకోవటం సవాలుగా మారుతుంది.

అవి డెంగీ లక్షణాలు కావొచ్చు

కరోనా లక్షణాలు అనగానే జ్వరం, దగ్గు, ఆయాసం వంటివే ముందుగా వినిపిస్తుంటాయి. లోతుకు వెళ్తున్న కొద్దీ కొత్త సంగతులెన్నో బయటపడుతున్నాయి. కరోనా బారినపడ్డవారిలో చర్మం మీద దద్దు వంటి లక్షణాలూ కనిపిస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. సుమారు 20% మందిలో చర్మ లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నాయి. డెంగీ జ్వరంలో తలెత్తే ఎర్రటి మచ్చల వంటివీ కొందరిలో కనిపిస్తున్నాయి. కరోనా.. డెంగీ.. మలేరియా. వ్యాధి ఏదైనా లక్షణం మాత్రం జ్వరమే. జ్వరం, పొడి దగ్గు, జలుబు, శ్వాసలో ఇబ్బందులు, రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు ఉంటే కరోనాగా భావించాలి. తగ్గని జ్వరం, ఒంటిపై దద్దుర్లు, వాంతులు, తలనొప్పి, కండరాల నొప్పి, కళ్లు కదల్చలేని పరిస్థితి ఉంటే డెంగీగా నిర్ధరించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ లక్షణాలు ఉన్నా భయపడవద్దు

కొన్ని చోట్ల జ్వరాల సర్వే చేస్తున్నారు. కొవిడ్‌ సర్వేలో భాగంగా అనుమానితులకు డెంగీ, మలేరియా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ర్యాపిడ్‌ టెస్టుల్లో ఒక్క గీత ఉంటే డెంగీ లేదని, 2 గీతలు వస్తే డెంగీ అనుమానితంగా భావిస్తారు. పూర్తి నిర్ధరణకు ఎలీసా పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తారు. అయితే... జలుబు, దగ్గు వంటి లక్షణాలు కరోనాకు ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అనుమానం ఉంటే ఆసుపత్రికి వెళ్లి నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలి. వర్షాకాలంలో దోమలు దాడి చేస్తుంటాయి. జూన్‌ నుంచి జనవరి వరకు వీటి భయం ఉంటుంది.

ఇళ్ల చుట్టూ ఖాళీ స్థలాలుంటే నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పగటి పూట నిద్రపోతే రక్షణకు తెరలు, నివారణ మందులు వినియోగించాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. స్నానానికి యాంటీ ఫంగల్‌ సబ్బులు వాడాలి. ఇదే కోవకు చెందిన క్రీములు, పౌడర్లు వాడు కోవచ్చు. కాచి, చల్లార్చి, వడబోసిన నీటిని తాగడం మేలు. డెంగీ సోకిన వారిని కొన్ని రోజుల తరవాత పరీక్షిస్తే కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిన సందర్భాలూ ఉన్నాయి. అందుకే...ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం ఉత్తమం.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 1813 కరోనా కేసులు..17 మరణాలు

ABOUT THE AUTHOR

...view details