రాజధాని అమరావతిలో సచివాలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయించారు. నిర్ణయించుకున్న ముహూర్తానికి కార్యక్రమం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 11.22కి సభా ప్రాంగణానికి చేరుకొని.. 11.27కి గవర్నర్‌తో కలసి వేదికపైకి వచ్చారు. అక్షర క్రమంలో అంబటి రాంబాబుతో మొదలై... విడదల రజనితో ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది. అంజాద్ బాషా అల్లా సాక్షిగా ప్రమాణం చేయగా, మిగతా వారు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆదిమూలపు సురేష్, ఉషశ్రీ చరణ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంగ్లంలో, మిగతా వారంతా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం ముగిశాక గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు ఫొటో దిగారు. ఆ తర్వాత తేనీటి విందులో పాల్గొన్నారు.
తడబాట్లు... పొరపాట్లు!
తెలుగులో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ‘సార్వభౌమాధికారం’, ‘అంతఃకరణశుద్ధి’ పదాలు పలికేటప్పుడు తడబడటం గతంలో చాలా సార్లు జరిగింది. ఈసారి ఒక్క బొత్స సత్యనారాయణ ఆ రెండు పదాలు పలికేటప్పుడు కొంచెం తొట్రుపడ్డారు తప్ప, మిగతావారంతా ఆ పదాల్ని జాగ్రత్తగానే పలికారు. కారుమూరి నాగేశ్వరరావు... శాసనము ద్వారా నిర్మితమైన అని కాకుండా.. ‘నిర్మాతమైన’ అని పలికారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా’ అనకుండా... ‘ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా’ అని చెప్పారు. ఆర్కే రోజా, విడదల రజని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొంత భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు. ‘ప్రమాణం చేస్తున్నాను’ అని చెప్పాల్సిన చోట... ‘ప్రమాణ స్వీకారం చేసి చెబుతున్నాను’ అని రోజా చదివారు. ‘కర్తవ్యాన్ని’ అని చదివేటప్పుడు విశ్వరూప్ కొంత తొట్రుపడ్డారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు కొత్త మంత్రుల పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పిలిచారు. ‘తానేటి వనిత’ పేరుని ‘తేనేటి వనిత’ అని పిలిచారు.
పిలిచింది రామలింగేశ్వరరావు అని... ప్రమాణం చేసింది రాజా అని..!
మంత్రి దాడిశెట్టి రాజా పేరు విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మంత్రుల జాబితాలో ఆయన పేరు దాడిశెట్టి రామలింగేశ్వరరావు అని ఉంది. వేదికపైకి పిలిచేటప్పుడు సీఎస్ సమీర్‌శర్మ ఆయన పేరుని... దాడిశెట్టి రామలింగేశ్వరరావు అనే పలికారు. కానీ ఆయన మాత్రం ‘దాడిశెట్టి రాజా అనే నేను’.. అని ప్రమాణ స్వీకారం చేశారు. రికార్డులో ఒక పేరు ఉంటే... ఆయన మరో పేరుతో ప్రమాణ స్వీకారం చేయడం సాంకేతికంగా సమస్య కావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.