లాడ్జిలో ఒంగోలు యువతి హత్య.. ప్రియుడి పనేనా? ప్రేమ పేరుతో యువతికి శారీరకంగా దగ్గరయ్యాడు... పెళ్లి మాట వచ్చే సరికి ముఖం చాటేశాడు. ఒత్తిడి చేయటంతో అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. పథకం ప్రకారం హత్య చేశాడు. పోలీసులకు దొరకుండా ఉండేందుకు సరికొత్త డ్రామాకు తెరతీశాడు. అన్ని అనుకున్నట్టే చేసినా.. ఒక్క దగ్గర మాత్రం ప్లాన్ బెడిసికొట్టింది. ప్రాణాలకు తెగించి హత్య నుంచి తప్పించుకోవాలన్న ఆ ప్రబుద్ధుని అసలు నాటకం బయటపడింది.
ప్రియుడే హత్య చేసి.. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు యత్నించినట్టు నమ్మించి.. అందరి కళ్లుగప్పి తప్పించుకోవాలనుకున్నాడు. ప్లాన్ అయితే వేశాడు కానీ.. అది అంత సులభం కాదని గ్రహించలేక.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని చందానగర్ ఠాణా పరిధిలో జరిగింది. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. యువతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.
స్టాఫ్‌నర్స్, మెడికల్ రిప్ మధ్య లవ్..
ప్రకాశం జిల్లా కరవాడికి చెందిన గొర్రెముచ్చు నాగ చైతన్య అనే యువతి.. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్‌గా పని చేస్తోంది. గుంటూరు జిల్లా రెంటచింతల గ్రామానికి చెందిన గాదె కోటిరెడ్డి ఒంగోలులో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా నాగ చైతన్య పని చేసే ఆస్పత్రికి వెళ్లే కోటిరెడ్డికి నాగచైతన్యతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
పెళ్లికి కుటుంబం ఒప్పుకున్నాక..
ఆరు నెలల క్రితం హైదరాబాద్ చందానగర్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో నాగచైతన్యకు ఉద్యోగం రావడంతో నగరానికి వచ్చింది. ఆస్పత్రికి సమీపంలోని ఓ హాస్టల్లోనే నివాసం ఉండేది. ఇక మన హీరో.. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు తరచూ వస్తూ... నాగచైతన్యను కలిసేవాడు. విషయం నాగచైతన్య కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆరా తీశారు. అసలు విషయం చెప్పగా.. పెళ్లికి అమ్మాయి తరఫు కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. అయితే.. అప్పటి నుంచి కోటిరెడ్డి ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
చంపేసి.. తాళం వేసి..
నాగచైతన్యను ఇబ్బందిగా భావించిన కోటిరెడ్డి.. ఆమెను ఎలాగైనా హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం సినిమా కథను తలదన్నే రీతిలో పథకం రచించాడు. అందుకు ఈ నెల 23 మూహుర్తం పెట్టాడు. అదే రోజు నలగండ్లలోని ఓ లాడ్జికి నాగచైతన్యను తీసుకుని వెళ్లాడు. రాత్రంతా అక్కడే ఉండి.. 24 తెల్లవారుజామున నాగచైతన్యను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని గదిలోనే పెట్టి.. తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎలాగైనా బయటకొస్తుందని.. పోలీసులు దర్యాప్తు చేస్తారని.. ముందే ఊహించిన కోటిరెడ్డి.. తప్పించుకునేందుకు మరో ప్రత్యేకమైన ప్లాన్ వేశాడు.
అక్కడ బయటపడ్డాడు..
తనంతట తానే ఒంటిపై గాయాలు చేసుకున్నాడు. నేరుగా ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి వెళ్లాడు. అనుమానం వచ్చిన వైద్యులు కోటిరెడ్డిని ఆరా తీయగా... అసలు విషయం చెప్పి పప్పులో కాలేశాడు. తాను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని... పెద్దలు ఒప్పుకోకపోవడంతో హైదరాబాద్ చందానగర్ లో ఆత్మహత్యకు యత్నించామని తెలిపాడు. ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంగోలు పోలీసులు చందానగర్ పోలీసులకు విషయం చేరవేశారు.
లాడ్జీపై కూడా కేసు..
సదరు లాడ్జీకి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లారు. గదిలో రక్తపు మడుగులో యువతి చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కోమటిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. లాడ్జీలో సీసీ కెమెరాలు పనిచేయకపోవటం.. నిర్లక్ష్యంగా వ్యవహించటం వల్ల యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంగోలు పోలీసుల సహకరంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కోటిరెడ్డి వద్ద ఉన్న లాడ్జీ గది తాళాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఒప్పుకున్నా చంపేశాడు..
కోటిరెడ్డితో నాగచైతన్యకు ఏడాదిగా పరిచయం ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. నర్సింగ్ చదివేటప్పుడు మెడికల్ రిప్‌గా పనిచేస్తున్న కోటిరెడ్డితో పరిచయం ఏర్పడిందన్నారు. ఇద్దరు ప్రేమించుకున్నారని.... వివాహం చేసుకోవాలని భావించారని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే వాళ్ల విషయం తెలిసి.. ఇద్దరికీ పెళ్లి చేస్తామని చెప్పినట్టు వివరించారు. అంతలోనే తమ కూతురిని ఇలా హత్య చేసిన కోటిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:అధికారుల కళ్లల్లో కారం చల్లి, ఆపై రాడ్డుతో కొట్టి.. ఆమె ఎందుకిలా చేసింది?