ఘనమైన చరిత్ర కలిగిన సురభి కళావైభవాన్ని నేటితరం ఆధునిక సాంకేతికత సాయంతో ముందుకు తీసుకెళ్తోంది. కరోనా వెంటాడినా.. లాక్‌డౌన్ ఆంక్షలతో ఆకలి కేకలు వినిపించినా.. తమ ఆలోచనలతో కళను బతికించుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో నాటకాలు ప్రదర్శిస్తూ కళాకారులకు అండగా నిలుస్తున్నారు. త్వరలో ఓటీటీ వేదికగానూ ప్రదర్శనలు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.
136 ఏళ్లనుంచి సురభి నాటకాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రత్యక్ష అనుభూతిని కలిగించే సురభి నాటకాల్లోని మాయాజాలానికి ఎవ్వరైనా మంత్రముగ్దులవ్వాల్సిందే. నాటక ప్రదర్శనలో వారు చూపించిన చొరవ సురభి ఖ్యాతిని నలుమూలలా మారుమ్రోగేలా చేసింది. నాటి పెద్దల అడుగుజాడల్లో నడిచిన యువతరం సురభి నాటకానికి వన్నెతెచ్చే ప్రయత్నాలు చేశారు. కానీ కరోనా ప్రభావం సురభి నాటకాల మీద పడటంతో కళాకారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దాంతో సురభి డ్రామా థియేటర్ నిర్వాహకుడు సురభి జయానంద్ తమ కళాకారులను అదుకునేందుకు ఆన్‌లైన్ వేదికగా నాటకాలను ప్రదర్శించడం మొదలుపెట్టారు. దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం సహకారంతో మాయాబజార్ నాటకాన్ని జూమ్‌లో ప్రదర్శించారు. ఆ నాటకాన్ని ఆన్‌లైన్‌లో సుమారు 3,000 మంది వీక్షించి, సురభికళాకారులకు తమ వంతు ఆర్థిక సాయం అందించారు. అలా ఈ ఏడాది ఏప్రిల్ వరకూ 28 నాటకాలను ఆన్‌లైన్‌లో ప్రదర్శించారు. అదేవిధంగా నేటి తరం ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఓటీటీ వేదికగానూ నాటకాలను ప్రదర్శించడానికి సురభి డ్రామా థియేటర్ కళాకారులు సిద్ధమవుతున్నారు.