ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజకీయ రంగులు కుదరవ్..!: సుప్రీం - రాజకీయ రంగులపై సుప్రీం ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసిన అంశంపై హైకోర్టు తీర్పును కాదని... సుప్రీంకు వెళితే అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయంపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టేసిన ధర్మాసనం... గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులను తొలగించాల్సిందేనని.. స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా తీర్పును ఉల్లంఘించే ప్రయత్నం చేసినట్లుగా హైకోర్టు గుర్తించిందని వ్యాఖ్యానించింది. నాలుగు వారాల్లో పంచాయతీలన్నింటికీ రంగులు తొలగించాలని ఆదేశించింది.

colors
colors

By

Published : Jun 3, 2020, 9:06 PM IST

గ్రామ పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగుల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే హైకోర్టు రెండు సార్లు ప్రభుత్వ తీరును తప్పుపట్టగా.. సర్వోన్నత న్యాయస్థానంలోనూ అదే పరిస్థితి ఎదురైంది. రంగుల విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 622, 623ని హైకోర్టు రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది. రాష్ట్ర ప్రుభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ రవీంద్రభట్​ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగుల విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టు ఇంతకు మునుపే తీర్పు ఇచ్చాక కూడా మరో రంగును కలిపి కొత్త జీవో తేవడం ఏంటంటూ మండిపడింది.

హైకోర్టు తీర్పు..

పంచాయతీ కార్యాలయాలకు అధికార పార్టీ పతాకాన్ని పోలిన రంగులు వేస్తున్నారంటూ రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారణ చేసిన హైకోర్టు.. పంచాయతీ ఎన్నికల్లోగా రంగులన్నీ తొలగించాలంటూ మార్చి 10వ తేదీన తీర్పునిచ్చింది. పంచాయతీ కార్యాలయాలకు ఏ రాజకీయ పార్టీని ప్రతిబింబించే రంగులు లేకుండా కలర్ కాంబినేషన్​ను నిర్ణయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలిచ్చింది. ఈలోగా కరోనా వ్యాప్తి చెందడంతో.. లాక్​డౌన్ ఎత్తివేసిన తర్వాత మూడు వారాల గడువులోగా ఈ ఆదేశాలను అమలు చేయాలని ఈ ఏడాది ఏప్రిల్ 20న మరో ఉత్తర్వు ఇచ్చింది.

కొత్త జీవోలు..

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు వచ్చాక.. ప్రభుత్వం మరో రెండు జీవోలు తెచ్చింది. పంచాయతీ కార్యాలయాలకు నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు.. ఎర్రమట్టి రంగు వేసేందుకు ఏప్రిల్ 23న 622, 623 జీవోలను తెచ్చింది.

జీవోల రద్దు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 10న తాము ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘిస్తోందని వ్యాఖ్యానించిన ఉన్నత న్యాయస్థానం.. మే 22 వతేదీన ఈ జీవోలను రద్దు చేసింది. తీర్పును ఉల్లంఘించేలా వ్యవహరించినందుకు గాను కోర్టు ధిక్కరణ ప్రక్రియను ప్రారంభించింది. మే 28వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. దీనిపై సీఎస్ నీలం సాహ్ని హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు.

సుప్రీంలో పిటిషన్..

రాష్ట్రం ప్రభుత్వం ఈ అంశాన్ని అంతటితో వదల్లేదు. జీవోల రద్దుపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహా.. వాదనలు వినిపించారు. ప్రభుత్వం కేవలం జీవోలు జారీ మాత్రమే చేసిందని వాటిని అమలు చేయలేదని చెప్పారు. మూడు వారాల గడువు ముగియక ముందే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం ప్రీ మెచ్యూర్ అవుతుందని సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీలకు రంగుల కాంబినేషన్ ఇంకా నిర్ణయం కాలేదని కోర్టుకు వివరించారు. హైకోర్టు... జీవోలపై రిట్ పిటిషన్​ను అనుమతించి ఉండాల్సింది కాదన్నారు.

ఈ వాదనతో ఏకీభవించని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ధర్మాసనం.. హైకోర్టు తీర్పును సమర్థించింది. హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పును ఇచ్చిందని ఇందులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏదైనా పార్టీ జెండా రంగులను పోలిన రంగులను గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వేయవద్దని హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉందని సుప్రీం అభిప్రాయపడింది. మార్చి 10న హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ 622, 623 జీవోలు ఇచ్చారని.. వాటిని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పును ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

కావాలనే ఉల్లంఘించారు...

హైకోర్టు తీర్పును ఉల్లంఘించడానికి ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నాలు చేసినట్లు హైకోర్టు గుర్తించిందని.. విధాన పరమైన నిర్ణయాలు న్యాయ సమీక్షకు, తీర్పులకు లోబడి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాల ఆదేశాలు పాటించకపోతే న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం క్షీణిస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. జీవో 622, 623 పై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆమోదిస్తూ.. మార్చి 10న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులు తొలగించాలని తేల్చి చెప్పింది. 4 వారాల్లో రంగులు తొలగించాలని.. రంగులు తొలగించడానికి సమయం పొడిగించినందున హైకోర్టు తీసుకున్న కోర్టు ధిక్కరణ చర్యలను ముగిస్తున్నట్లు తీర్పు కాపీలో పేర్కొంది.

సుప్రీంలో రెండో 'సారీ'

ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల వ్యవహారంలో ఏపీ హైకోర్టు రంగులు తొలగించాలని ఆదేశిస్తే.. మార్చినెలలో ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. అప్పుడు కూడా ప్రభుత్వ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు ఎలా వేస్తారంటూ ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను కొట్టివేసింది. మళ్లీ అదే రంగుల విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వచ్చింది. రంగుల విషయంలో కోర్టు తీర్పునే ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారని మరోసారి తప్పుపట్టింది.

ABOUT THE AUTHOR

...view details