SC ON SHIVA SHANKAR BAIL PETITION : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఆయనే కీలక వ్యక్తి (కింగ్‌పిన్) అని వ్యాఖ్యానిస్తూ బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో శివశంకర్‌రెడ్డి సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
‘ఎఫ్‌ఐఆర్‌లో శివశంకర్‌రెడ్డి పేరు లేదు. అప్రూవర్‌గా మారిన వ్యక్తి 2021 జులైలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తాను ఫలానా వ్యక్తిని చూశానని చెప్పారు తప్పితే ఆయన పేరు చెప్పలేదు. 2021 అక్టోబరు 26న దాఖలు చేసిన ఛార్జిషీట్‌లోనూ పేరు లేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎ-1 కేవలం 90 రోజుల్లోపే బెయిల్ పొందారు. శివశంకర్‌రెడ్డి నుంచి ఎవరో డబ్బులు తీసుకున్నట్లు ఎవరి మాటల ద్వారానో తాను విన్నట్లు చాలా రోజుల తర్వాత ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు’ అని వివరించారు.
జస్టిస్ ఎం.ఆర్.షా జోక్యం చేసుకుంటూ.. ‘ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎ-1 కాదు.. శివశంకర్‌రెడ్డే’ అని వ్యాఖ్యానించారు. సింఘ్వీ స్పందిస్తూ.. ‘అది కేవలం అక్కడక్కడా వినిపిస్తున్న మాట తప్పితే ఇప్పటివరకూ శివశంకర్‌రెడ్డి పేరును ఎవరూ చెప్పలేదు. కానీ ఇక్కడ నేరం చేసిన ఎ-1 బెయిల్ మీద బయటికొచ్చారు. ఎ-4గా ఉన్న అప్రూవర్‌కు సీబీఐ కల్పించిన ప్రయోజనం కారణంగా ముందస్తు బెయిల్ ఇచ్చారు. ఎందులోనూ పేరులేని శివశంకర్‌రెడ్డి 11 నెలల నుంచి జైల్లో ఉన్నారు. ఆయన పాత్ర గురించి ఖరారు చేయడానికికానీ, తిరస్కరించడానికికానీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని ట్రయల్ కోర్టు చెప్పింది’ అని పేర్కొన్నారు. అప్పుడు జస్టిస్ ఎం.ఆర్.షా జోక్యం చేసుకుంటూ.. ‘మీ క్లయింట్ చాలా ప్రభావశీలురు, సాక్ష్యాలను తారుమారు చేయడానికి అవకాశాలున్నాయి’ అని పేర్కొన్నారు.
సింఘ్వీ స్పందిస్తూ.. కావాలంటే మీరు ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తన క్లయింట్ ఎవరికో డబ్బులు ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ అని, అది కోర్టు ట్రయల్‌లో తేలుతుందని వాదించారు. అవతలి పక్షం కేసు ట్రయల్‌ను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతున్నందున బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
హైకోర్టు తీర్పులోని పేరా 13-17లో అన్ని వివరాలను స్పష్టంగా చెప్పిందని, అందువల్ల నిందితుడి విడుదలకు నిరాకరిస్తున్నామని పేర్కొంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. శివశంకర్‌రెడ్డి ఇందులో లేరని మేం నమ్మడం లేదని, ఆయనే ఇందులో కింగ్‌పిన్ అని జస్టిస్ ఎం.ఆర్.షా వ్యాఖ్యానించారు. కనీసం ఏదో ఒక ఉపశమనం ఇవ్వాలని శివశంకర్‌రెడ్డి తరఫు న్యాయవాది సింఘ్వీ విజ్ఞప్తి చేయగా, కుదరదని స్పష్టం చేస్తూ విచారణను ముగించారు.