ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏడాది నుంచి సస్పెన్షన్ పొడిగింపుపై సర్వీస్ నిబంధనలు చూపించాలని జస్టిస్ ఎంఎం ఖన్‌విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ అఖిల భారత సర్వీసు నిబంధనల్లోని రూల్3-1సీ కింది సస్పెన్షన్ పొడిగించామని తెలిపారు. రివ్యూ కమిటీ నిర్ణయం ప్రకారం ఆరునెలల తర్వాత పొడిగించినట్లు చెప్పారు.
సస్పెన్షన్ కేసులో కౌంటర్ దాఖలు చేయండి.. ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం - ab venkateswara rao ips
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రివ్యూ కమిటీ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు 3 రోజుల గడువు కావాలని ఏబీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ మేరకు కోర్టు అనుమతి ఇస్తూ.. తదుపరి విచారణను మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. మూడు రోజుల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి ఛార్జ్ లేదని.. రూల్3లోని 1బీ ప్రకారం ఏడాది కంటే ఎక్కువగా సస్పెన్షన్ ఉండటానికి వీల్లేదని ఆయన తరఫు న్యాయవాది ఆదినారాయణరావు వాదించారు. అలాంటప్పుడు రివ్యూ కమిటీ ఆదేశాలను ఎందుకు సవాల్ చేయలేదని ఏబీ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రివ్యూ కమిటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేసేందుకు ఆయన మూడు రోజులు గడువు కోరగా.. న్యాయస్థానం అనుమతించింది. రివ్యూ కమిటీ ఆదేశాలపై సవాల్ చేసిన మూడురోజుల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది.
అనుబంధ కథనం:ఏడాదిగా సస్పెన్షన్ ఎలా కొనసాగుతుంది?: సుప్రీం కోర్టు