ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పోలవరంపై సందేహాలు నివృత్తి చేయాల్సింది ఏపీనే' - పోలవరంపై సుప్రీంలో వాదనలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ను నిలిపివేస్తూ ఇచ్చిన గత ఉత్తర్వులపై.. అభ్యంతరాలేంటో తెలపాలని ఒడిశాను ఆదేశించారు. పోలవరం ప్రభావిత రాష్ట్రాల అభ్యంతరాలు, సందేహాలు నివృత్తి చేయాల్సింది ఏపీనే అని  సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలవరంపై తాజా నివేదిక అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.  పిటిషన్‌ విచారణ రెండు వారాలపాటు వాయిదా వేసింది.

supreme court on Polavaram about odisha objections
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ

By

Published : Jan 14, 2020, 4:15 PM IST

Updated : Jan 14, 2020, 4:45 PM IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. ప్రాజెక్టు స్టేటస్ రిపోర్టు, నిర్మాణ చిత్రాలతో పూర్తి సమాచారం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఒడిశా, తెలంగాణ అభ్యంతరాలపై 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బచావత్ అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చారని సుప్రీంలో ఒడిశా వాదనలు వినిపించింది. ప్రాజెక్టు ముంపుపై కనీసం అధ్యయనం కూడా చేయలేదని ఒడిశా అభ్యంతరం చెప్పింది.

ఎలాంటి మార్పులు లేవు : కేంద్రం
ప్రాజెక్టు నిర్మాణంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న తెలంగాణ ప్రభుత్వం.. మణుగూరు ప్లాంట్‌, గిరిజనులకు ముంపు నష్టం లేకుండా చూడాలని కోరింది. ప్రాజెక్టు యథావిధిగానే కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి మార్పులు లేవని కోర్టుకు తెలిపారు. ఒడిశా, తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలవరం ప్రభావిత రాష్ట్రాల అభ్యంతరాలు, సందేహాలు నివృత్తి చేయాల్సింది ఏపీనే అని స్పష్టం చేసింది. 2 వారాల్లోగా పోలవరానికి సంబంధించిన సమాచారం అందిస్తామని ఏపీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ సర్వోన్నత న్యాయస్థానం 2 వారాలకు వాయిదా వేసింది.

Last Updated : Jan 14, 2020, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details