ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అభివృద్ధి పనులు చేయాలంటే ఈసీ అనుమతి తీసుకోండి..: సుప్రీంకోర్టు - స్థానిక ఎన్నికలపై సుప్రీంలో విచారణ

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా సమయంలో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈసీ అనుమతి తీసుకోవాలన్న ఆదేశాలను సవరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్​ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించింది. నిర్దిష్ట అభివృద్ధి పనులకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వ దరఖాస్తుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందనను తమకు తెలియజేయాలని న్యాయస్థానం పేర్కొంది.

supreme court
సుప్రీంకోర్టు

By

Published : Nov 16, 2020, 1:38 PM IST

Updated : Nov 16, 2020, 7:11 PM IST

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాయిదా అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​ను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడగా... రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి పనులకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ తేదీలు ఖరారు కానందున ఈ ఉత్తర్వులను సవరించాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైనా అభివృద్ధి పనులను ఆపిందా అంటూ ముకుల్ రోహత్గిని న్యాయస్థానం ప్రశ్నించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో లేదని.. ఇంకా స్థానిక ఎన్నికల తేదీలు ఖరారు కానందున తమకు అభివృద్ధి పనులు చేపట్టేలా ఆదేశాలను సవరించాలని రోహత్గి కోరారు. ఎన్నికలను వాయిదా వేశారా లేక రద్దు చేశారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ఎన్నికలను కేవలం వాయిదా మాత్రమే వేశామని.. ఎన్నికల నిర్వహణకు చర్యలు ప్రారంభించినట్లు ఎన్నికల సంఘం తరపు న్యాయవాది పరమేశ్వర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్​ను రద్దు చేస్తే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది రోహత్గి అన్నారు. ఈ దశలో నిర్దిష్ట అభివృద్ధి పనులకు అనుమతి కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకొని.. ఈసీ స్పందనను తమకు తెలియజేయాలని సీజేఐ ఎస్ ఏ బోబ్డే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి అంగీకరించారు. తదుపరి విచారణను ధర్మాసనం 4 వారాలకు వాయిదా వేసింది.

Last Updated : Nov 16, 2020, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details