ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గాలి జనార్దన్‌ రెడ్డి కేసులో సుప్రీంకోర్టు రోజువారి విచారణ

గాలి జనార్దన్‌ రెడ్డి అక్రమ మైనింగ్‌ కేసు వ్యవహారంలో విచారణ రోజువారి జరపాలని ...ట్రయల్‌ కోర్టును ఆదేశించాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తనకు ఇచ్చిన బెయిల్‌ షరతులు సడలించి.. బళ్లారి వెళ్ళేందుకు అనుమతించాలని గాలి దాఖలు చేసిన పిటిషన్‌పై …జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారీలతో  కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

By

Published : Sep 30, 2022, 7:39 AM IST

Updated : Sep 30, 2022, 9:56 AM IST

omc
omc

సొంత ప్రదేశాన్ని వీడి ఇప్పటికే 15 ఏళ్లు దాటిందని.. బళ్లారిలో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని గాలి జనార్ధన్ రెడ్డి తరపు న్యాయవాది మీనాక్షి అరోరా సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ ప్రత్యేక కోర్టులో విచారణ ఆలస్యం అవుతోందని.. గతేడాది ఆగస్టులో బెయిల్‌ ఇచ్చిన తర్వాత సర్వోన్నత న్యాయస్థానం విధించిన షరతులు ఎక్కడా ఉల్లంఘించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ ఎంఆర్‌ షా.. దీనికి గాలి జనార్ధన్‌రెడ్డి కారణం కాదా, ఆయన ప్రమేయం లేదా అని ప్రశ్నించారు. గాలి బెయిల్‌ షరతులు సడలించవద్దని సీబీఐ తరపు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మాధవి దివాన్‌ కోర్టును అభ్యర్థించారు. ఇప్పటికే ఇచ్చిన బెయిల్‌ని ఆసరా చేసుకుని సాక్షులపై తీవ్ర ప్రభావం చూపుతున్నారని.. సాక్ష్యాధారాలను తారుమారు చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఈ విషయంలో ఏమాత్రం కనికరం చూపినా.. కేసుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ప్రత్యేక కోర్టులో, హైకోర్టులో డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా.. కేసు ఆలస్యానికి కారణం అయ్యారని పేర్కొన్నారు. కేసు విచారణ చేపట్టిన న్యాయాధికారులను ప్రభావితం చేయాలని చూశారని.. ఓ న్యాయాధికారి అనుమానాస్పదంగా మరణించారని కోర్టు దృష్టికి తెచ్చారు. బెయిల్‌ ఇస్తే వీళ్లు ఎలా ఉంటారో .. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే అని ధర్మాసనం ముందు సీబీఐ వాదించింది. ఈ సందర్భంలో కల్పించుకున్న గాలి తరపు న్యాయవాది.. అవసరమైతే బళ్లారిలో గాలి నివాసం వద్ద తగినంత బందోబస్తు పెట్టుకోవచ్చన్నారు. అందుకు కూడా సీబీఐ అంగీకరించలేదు. గాలి జనార్ధన్‌రెడ్డికి మనవరాలు పుట్టిందని.. శిశువుని చూసేందుకు, కుటుంబంతో గడిపేందుకు 2 నెలల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీబీఐ న్యాయవాది.. ఇప్పుడు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని, షరతులను మార్చవద్దని కోరారు. దీనిపై స్పందించిన గాలి న్యాయవాది కనీసం 4 వారాలైనా ఇవ్వాలని విన్నవించారు. స్పందించిన ధర్మాసనం గాలికి మనమరాలు పుట్టిందో లేదో కనుక్కోవాలని సీబీఐ ని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వుల కోసం విచారణను నేటికి వాయిదా వేసింది.

Last Updated : Sep 30, 2022, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details