తెలంగాణలో ప్రవేశపెట్టిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంపై దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సరైన అధ్యయనం లేకుండానే అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరిస్తున్నారంటూ.. జమ్మికుంట వాసి జువ్వాడి సాగర్రావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా అక్రమాలకు పాల్పడిన స్థిరాస్తి వ్యాపారులను వదిలేసి ఇళ్లు, స్థలాలను కొన్నవారిని శిక్షిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. మహా నగరాల్లో వరదలకు అక్రమ లే అవుట్లే కారణమన్న పిటిషనర్.. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.