పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్ విచారణ నేపథ్యంలో.. ధర్మాసనం నుంచి జస్టిస్ లావు నాగేశ్వరరావు తప్పుకొన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు, పరిహారం, పునరావసంపై మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వేసిన పిటిషన్పై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం కోర్టుకు ఈ కేసును బదిలీ చేయాల్సిన అవసరం లేదని.. పర్యావరణ ప్రభావంపై సంబంధిత రాష్ట్రాలు సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది.
ఆ ఎన్జీటీ తీర్పును సవాలు చేస్తూ ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టులో జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ వినీత్ శరణ్ ల ధర్మాసనం ముందుకు పిటిషన్ విచారణకు వచ్చింది. గతంలో న్యాయవాదిగా పోలవరం తరఫున వాదనలు వినిపించినందున ధర్మాసనం నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ నాగేశ్వరరావు తెలిపారు. తాను సభ్యునిగా లేని ధర్మాసనం ముందు ఏప్రిల్ 29 విచారణ జాబితాలో ఈ కేసును చేర్చాలని సుప్రీంకోర్టును రిజిస్ట్రీకి తెలిపారు.