SC Classification: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కేసులో కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమాకోహ్లితో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఎమ్మార్పీఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ‘‘ఎస్సీల్లో అధిక సంఖ్యలో ఉన్న మాదిగలకు.. జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు లేవు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ ఇబ్బందిపడుతున్నారు. ఎస్సీ వర్గీకరణపై చిన్నయ్య కేసును ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి పంపినందున తీర్పు వెలువడటానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో స్వల్పకాల నోటీసు ఇచ్చి తాత్కాలికంగా ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో చూడండి’’ అని కోరారు.
స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ.. ‘‘కేసు విచారణను వేగవంతం చేయాలని ఏడుగురు సభ్యుల ధర్మాసనాన్ని మేం అడగలేం. మీరే ఆ కేసులో ఇంప్లీడ్ అయి వాదనలు వినిపించండి. మళ్లీ ప్రత్యేక రిట్ పిటిషన్ ఎందుకు’’ అని ప్రశ్నించారు. ఆ ధర్మాసనం విచారణ చేపట్టేలోపు.. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఎదురు చూసే మాదిగ యువత ఇబ్బందిపడతారని రోహత్గీ అన్నారు. జోక్యం చేసుకున్న సీజేఐ.. ఇలాంటి కేసులో ఎవరైనా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తారని మీరు ఆశించగలరా? విచారణ చేపట్టకుండానే మధ్యంతర ఉత్తర్వులు సాధ్యమేనా అని ప్రశ్నించారు. రోహత్గీ స్పందిస్తూ రెండు వారాల తర్వాత మళ్లీ విచారణకు స్వీకరించి ఒక పరిష్కారం చూపాలని కోరుతున్నట్లు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వాదనల అనంతరం ప్రస్తుత పిటిషన్‌ను ఇంప్లీడ్ చేస్తూ.. ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం: మంద కృష్ణ
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కేసులో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. విస్తృత ధర్మాసనం ఏర్పాటు ఆలస్యమవుతున్నందున తమకు న్యాయం జరిగేలా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరినట్లు బుధవారం దిల్లీలో చెప్పారు.