ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సుప్రీంలో ఎంపీ రఘురామకు ఊరట.. బెయిల్‌ మంజూరు - supreme court granted bail to mp raghu rama

mp raghu rama krishnam raju
ఎంపీ రఘురామ

By

Published : May 21, 2021, 4:57 PM IST

Updated : May 22, 2021, 3:34 AM IST

14:43 May 21

ఎంపీ రఘురామకు బెయిల్ మంజూరు

      వైకాపా నర్సాసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. గతేడాది డిసెంబరులో పిటిషనర్‌కు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరిగిందని.. ప్రస్తుత పరిస్థితులు, పిటిషనర్‌ విజ్ఞప్తిని  పరిశీలించి బెయిల్‌ మంజూరు చేస్తున్నామని పేర్కొంది. పిటిషనర్‌ చేసిన ప్రకటనలు వీడియో రూపంలో ఉన్నందున కస్టడీలో విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. సైనికాసుపత్రి నివేదికను పరిశీలిస్తే పిటిషనర్‌పై కస్టడీలో ఆనుచిత ప్రవర్తన జరిగిందనడాన్ని తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించింది. బెయిల్‌పై ఉన్న సమయంలో ఈ కేసుకు సంబంధించిన అంశాలపై ఎంపీ పత్రిక, టీవీ, సామాజిక మాధ్యమాలతో మాట్లాడకూడదని, గాయాలను చూపకూడదని, ట్రయల్‌ కోర్టు విచారణకు రూ.లక్ష వ్యక్తిగత బాండు, ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని, సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదని షరతులు విధించింది. వాటిని ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.    

       ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు తనను కస్టడీలో హింసించారంటూ రఘురామకృష్ణరాజు, తన తండ్రికి దిల్లీ ఎయిమ్స్‌ లేదా సైనికాసుపత్రిలో పరీక్షలు చేయించాలని ఎంపీ కుమారుడు భరత్‌ దాఖలు చేసిన పిటిషన్లను గత మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్‌ సైనికాసుపత్రిలో పరీక్షలు నిర్వహించాలంటూ ఆదేశించింది. సైనికాసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదికపై జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.  

ఎంపీనే కస్టడీలో హింసిస్తే..

  పిటిషనర్లు రఘురామకృష్ణరాజు, భరత్‌ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ‘సికింద్రాబాద్‌ సైనికాసుపత్రి నివేదికను పరిశీలిస్తే సీఐడీ కస్టడీలో ఎంపీని హింసించారనే విషయం స్పష్టమవుతోంది. అధికార పార్టీ ఎంపీగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఆయన విమర్శించారు. వాటిలో రాజద్రోహం, నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు పెట్టే కేసులు లేవు. ఎంపీగా ఉన్న వ్యక్తినే కస్టడీలో హింసిస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి? నివేదిక ప్రకారం ఆయన కాలికి గాయాలయ్యాయి. దానిని సుప్రీంకోర్టు సుమోటోగా పరిగణించి కేసును సీబీఐతో విచారణ చేయించాలి’ అని రోహత్గీ విజ్ఞప్తి చేశారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ రాజును పిటిషనర్‌గానే కోర్టు చూస్తుందని, ఎంపీనా సాధారణ వ్యక్తా అని చూడదని వ్యాఖ్యానించింది. వాళ్లు (సీఐడీ) ఎంపీ విషయంలోనే అలా చేస్తే ఎవరికైనా అదే చేయగలరనేదే తన వాదనని ముకుల్‌ రోహత్గీ అన్నారు.   

ఆయనే గాయాలు చేసుకొని ఉండొచ్చు: ప్రభుత్వ న్యాయవాది

  రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తూ.. ‘ఎంపీని సైనికాసుపత్రికి తరలించే సమయంలో ఆయనే స్వయంగా గాయాలు చేసుకొని ఉండొచ్చు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి నివేదిక ప్రకారం ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. పోలీసులు హింసించాలనుకుంటే అలా చేస్తారా? ఎంపీతో ఏ  పోలీసూ అలా ప్రవర్తించరు. అదే సమయంలో సైనికాసుపత్రి నివేదికను మేం  తప్పుపట్టడం లేదు. ప్రభుత్వ అంబులెన్స్‌లో వెళ్లకుండా ఆయన తన  సొంత వాహనంలో వెళ్లారు. ఆ సమయంలో ఆయన ప్రజలకు అభివాదం  చేశారు. తన పాదాలు చూపుతూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అప్పుడు ఆయన కాళ్లకు ఎలాంటి గాయాలు లేవు. ఎంపీ సొంత కారులో 300 కిలోమీటర్లు తన రక్షణ సిబ్బందితో ప్రయాణించారు. అప్పుడే కాళ్లకు అలా జరిగి ఉండొచ్చు. సైనికాసుపత్రి నివేదిక ప్రకారం ఆయన కాలి గాయం (ఫ్రాక్చర్‌)  పాతదో, కొత్తదో తెలియదు. తనపై ఆరోపణలను ప్రాథమికంగా ఆయన (రఘురామకృష్ణరాజు) తోసిపుచ్చనందున ఈ దశలో కోర్టు జోక్యం  చేసుకోలేదు. ఈ అంశాలన్నీ విచారణలో తేలతాయి. 

            రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రిపై ఆరోపణలు, విమర్శలు చేయడంలో ఇబ్బంది లేదు. కానీ ఆయన కులాలు, మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. పరస్పరం చంపుకునేలా మాట్లాడుతున్నారు. చివరకు కరోనా వ్యాక్సినేషన్‌ విషయంలోనూ రెడ్డి, క్రైస్తవులకు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. రెడ్లు, క్రైస్తవులపై విద్వేషం వెదజల్లుతున్నారు. వాలంటీర్లపై దాడి చేయాలన్నారు.  ఓ ఎంపీ బాధ్యత ఇదేనా? ఎంపీ మాటలకు ప్రాధాన్యం ఉంటుంది. కొవిడ్‌  కష్టకాలంలో అశాంతిని మేం కోరుకోవడం లేదు. ఆయన చేస్తున్నది తప్పని చెప్పి.. సరిచేసుకోమని సూచించాం. కానీ ఆయన అన్ని హద్దులు మీరారు. పిటిషనర్‌ బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేయండి. హైకోర్టు  ఆయనను విచారణ జరుగుతున్న కోర్టుకు వెళ్లమని సూచించింది. బెయిల్‌ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేరుగా జోక్యం చేసుకోదు. ఆయన  ఎంపీ అయినంత మాత్రాన ఈ కేసులో మినహాయింపు ఇవ్వకూడదు. వేలాది మంది  న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటారు. ఇంత త్వరగా ఏ కేసూ వినలేదు.  నిజంగా పెద్ద దాడి జరిగితే సీబీఐ విచారణ కోరితే అర్ధం చేసుకోగలం. అనవసర కేసులతో సీబీఐ సీరియస్‌ కేసుల విచారణలో  జాప్యం చోటుచేసుకుంటోంది. ఇంత చిన్న కేసును సీబీఐకి బదలాయించమనడం ఏంటి? చూడబోతే రాష్ట్రపతి పాలన కోరేట్లు ఉన్నారు. బీమా కోరేగావ్‌, కేరళ  జర్నలిస్ట్‌ కప్పన్‌, అఖిల్‌ గొగొయ్‌ కేసుల్లో మాదిరే ఇందులోనూ బెయిల్‌ నిరాకరించండి. ప్రైవేటు ఆసుపత్రిలో ఎంపీకి పరీక్షలు చేయించనందుకు హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు విచారణ చేపట్టింది. దానిపై స్టే ఇవ్వండి’ అని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వాదనల సమయంలో దవేకు సీనియర్‌న్యాయవాది గిరి, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మహఫూజ్‌ నజ్కీ సహకరించారు. 

సీఎం బెయిల్‌ రద్దు చేయమన్నందుకే ఎంపీపై కక్ష

   అనంతరం రోహత్గీ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ తనను తాను గాయపర్చుకున్నారని వాదించడం పూర్తిగా అసంబద్ధమన్నారు. ‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ పిటిషన్‌ వేసినందున కక్ష కట్టారు. సైనికాసుపత్రి నివేదికను పరిశీలిస్తే విషయాలు అర్ధమవుతాయి. రాష్ట్ర ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఆపండి (స్టాప్‌ ద స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజం). ఆయన ప్రకటనలన్నీ వీడియోల రూపంలో ఉన్నప్పుడు కస్టడీలో విచారణ ఎందుకు? ఎంపీ మాట్లాడిన అంశాల్లో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చేసిన విజ్ఞప్తులను వదిలేసి కొన్నింటిని చూపుతూ కేసులు పెట్టారు. ఆయన బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఆయుధాలు తీసుకొని వెళ్లి హింస చేయమని చెప్పడం లేదు’ అని చెప్పారు. రాష్ట్ర పోలీసుల రక్షణపై నమ్మకం లేదని.. ఆయనకు కేంద్ర బలగాల భద్రత కొనసాగించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. రాజద్రోహం, రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఏమిటో, ఏవి ఆ పరిధిలోకి రావో, వాటికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను రోహత్గీ ఈ సందర్భంగా ఉటంకించారు. రోహత్గీతో పాటు సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు పిటిషనర్‌ తరపు వాదనలు వినిపించారు.

దర్యాప్తునకు సహకరించండి: ధర్మాసనం

  ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దర్యాప్తునకు ఎంపీ సహకరించాలని, దర్యాప్తునకు 24 గంటల ముందు అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. దర్యాప్తు సమయంలో ఆయన తరపు న్యాయవాది ఉండవచ్చని పేర్కొంది. హైకోర్టు సుమోటో విచారణ స్టేపై ధర్మాసనం స్పందించలేదు. రోహత్గీ వాదనల్లో ముఖ్యమంత్రి జగన్‌ కేసుల ప్రస్తావన తేవడంపై దవే తీవ్ర అభ్యంతరం తెలిపారు. అలాగే ఆ ఎంపీకి డబ్బులున్నాయి.. ఎంపీని వైద్య పరీక్షలకు విమానంలో తీసుకురావాలని రోహత్గీ కోరారంటూ దవే వ్యాఖ్యానించారు. పలు సందర్భాల్లో దవే, రోహత్గీ తీవ్ర స్వరంతో వాదనలు వినిపిస్తుండడంతో ధర్మాసనం ఇద్దరిని సున్నితంగా మందలించింది. ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులు ఎందుకంత సీరియస్‌గా ఉన్నారని ప్రశ్నించింది. దవే ఈ రోజు నవ్వుతూ కనిపించలేదని జస్టిస్‌ గవాయ్‌ వ్యాఖ్యానించడంతో అదేం లేదంటూ ఆయన చిరునవ్వు నవ్వారు. పలుమార్లు న్యాయమూర్తులు జోక్యం చేసుకొని వాతావరణాన్ని చల్లబర్చారు.


 

ఇదీ చదవండి:ఆస్పత్రికి తీసుకెళ్లేముందు ఎంపీ రఘురామ గాయాలు చేసుకున్నారా ?: సుప్రీం

Last Updated : May 22, 2021, 3:34 AM IST

ABOUT THE AUTHOR

...view details