ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​పై దాఖలైన పిటిషన్ల కొట్టివేత - సీజేఐకి సీఎం జగన్ లేఖ

న్యాయమూర్తులపై నిరాధార ఆరోపణలు చేస్తూ లేఖ రాసిన సీఎం జగన్​పై చర్యలు తీసుకోవాలని, ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోర్టులు, జడ్జిలపై సీఎం భవిష్యత్​లో నిరాధార ఆరోపణలు చేయకుండా చూడాలన్న మరో పిటిషన్​ను ఇప్పటికే విచారణలో ఉన్న మరో పిటిషన్​తో జత చేసింది. సీఎం జగన్​కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

cm jagan over letter to cji issue
cm jagan over letter to cji issue

By

Published : Dec 1, 2020, 3:23 PM IST

Updated : Dec 2, 2020, 4:11 AM IST

న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై నిరాధారణ ఆరోపణలు చేస్తూ సీఎం జగన్ లేఖ రాసి, బహిర్గతం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ రిషికేశ్ రాయ్​లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సీఎం జగన్ న్యాయవ్యవస్థ స్వతంత్రపై దాడి చేశారని.. దీనిపై విచారణ చేపట్టాలని పిటిషనర్ జీఎస్ మణి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ రాసిన లేఖలోని వ్యాఖ్యలు ఇప్పటికే బహిర్గతం చేసినందున ఇంకా విచారణ చేపట్టేది ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు గాగ్ ఆర్డర్​ను మరో ధర్మాసనం ఎత్తివేసినప్పుడు ఇంకా ఏం మిగిలి ఉందో చెప్పాలని పిటిషనర్​ను ధర్మాసనం పశ్నించింది.

జీఎస్ మణి, ప్రదీప్ కుమార్​లు దాఖలు చేసిన పిటిషన్​లో రెండు భిన్నమైన అభ్యర్థనలు ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. సీఎం లేఖపై విచారణ జరిపాలంటూ మరో వైపు సీఎంను పదవి నుంచి తొలగించాలని కోరడంతో.... పిటిషనర్ ఏం కోరుకుంటున్నారో ఆయనకే స్పష్టత లేదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అన్నారు. సీఎంను పదవి నుంచి తొలగించాలన్న అభ్యర్థన న్యాయపరంగా చెల్లదని విచారణ అర్హత లేదంటూ జీఎస్ మణి, ప్రదీప్ కుమార్​ల పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వేసిన మరో పిటిషన్ పై విచారణ సందర్భంగా పిటిషన్ వేసిన సంస్థకు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయని, సంస్థ వెనుక ఎవరున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకే అంశంపై వందలాది పిటిషన్లను ప్రోత్సహించలేమని.. పత్రికల్లో వచ్చిన అంశాలను తీసుకొచ్చి వేసిన పిటిషన్​ను అనుమతిస్తే, రేపు మరొకరు ఇలానే పిటిషన్ వేస్తారని ధర్మాసనం వ్యాఖ్యనించింది. యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్టు పిటిషన్​ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సీఎం జగన్ భవిష్యత్తులో బహిరంగ ప్రకటనలు చేయకుండా నివారించాలని మరో పిటిషనర్ సునీల్ కుమార్ సింగ్ తరపు న్యాయవాది ముక్తి సింగ్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగంలోని ఆర్టికల్ 121 ఉల్లంఘించారని.. మాజీ ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబూద్రిపాద కేసును ముక్తి సింగ్ ఉదహరించారు. ఆ కేసులో ఓ నిర్దిష్టమైన అంశంలో ప్రకటనలు చేయకుండా సుప్రీంకోర్టు ఆయనను అడ్డుకుందని గుర్తు చేశారు. ఈ విషయంలో సీఎం జగన్​కు నోటీసులు ఇవ్వమని స్పష్టం చేసిన ధర్మాసనం.. పిటిషన్​ను మరో ధర్మాసనంలో ఉన్న అమరావతి ప్రాంతంలో భూ కొనుగోళ్లు, సిట్ దర్యాప్తునకు సంబంధించిన పిటిషన్​తో జత చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదీ చదవండి:

'పోలవరం నీటి నిల్వ సామర్థ్యం తగ్గింపు సాధ్యం కాదు'

Last Updated : Dec 2, 2020, 4:11 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details