ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Amaravathi lands: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ప్రభుత్వ పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

supreme court dismisses insider trading petition by ap government
supreme court dismisses insider trading petition by ap government

By

Published : Jul 19, 2021, 4:33 PM IST

Updated : Jul 20, 2021, 4:03 AM IST

16:30 July 19

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు

 

రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌లో ఎటువంటి మెరిట్స్‌ లేవని వ్యాఖ్యానించింది. భూముల కొనుగోళ్ల అంశంలో హైకోర్టు అన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని తీర్పిచ్చిందని.. దానిలో ఎటువంటి లోపం లేదని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై సోమవారం రెండు గంటలపాటు సాగిన వాదనలను విన్న అనంతరం జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం దాన్ని కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లకు సంబంధించి చెక్కా గురుమురళీమోహన్‌ తదితరులపై వెలగపూడికి చెందిన సలివేంద్ర సురేష్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసులు నమోదు చేసింది. దాన్ని సవాల్‌ చేస్తూ గురుమురళీమోహన్‌, ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. అది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాదంటూ హైకోర్టు జనవరి 19న తీర్పునిచ్చింది. దాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. పిటిషన్‌ను ధర్మాసనం గత శుక్రవారం విచారించి సోమవారానికి వాయిదా వేసింది.

హైకోర్టు తీర్పు తప్పు: దుష్యంత్‌ దవే
సోమవారం విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే, ప్రభుత్వ న్యాయవాది మహఫూజ్‌ నజ్కీ వాదించారు. దవే వాదనలు వినిపిస్తూ.. ‘హైకోర్టు తీర్పు తప్పు. సెక్షన్‌ 418 (అధికార రహస్యాల ఉల్లంఘన)ను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వంతో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులకు ఆ భూములు ఎందుకు కొంటున్నారో తెలుసు. అమ్మకందారులకే తెలియదు. ఆస్తుల బదిలీ చట్టం సెక్షన్‌ 55 ప్రకారం ఎందుకు కొంటున్నారో కొనుగోలుదారులు అమ్మకందార్లకు తెలియజేయాలి. దాన్ని వారు పాటించలేదన్న విషయాన్ని హైకోర్టు న్యాయమూర్తి విస్మరించారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం అసాధారణ అంశాల్లో తప్ప ఇటువంటి వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. భూముల కొనుగోళ్లు రాజ్యాంగబద్ధమైన హక్కు అని హైకోర్టు తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులు అమ్మిన భూములకు క్రిమినల్‌ చట్టాలు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ఈ చీటింగ్‌ కేసులో న్యాయమూర్తికి ఏ రాజ్యాంగ హక్కు కనిపించింది? విచారణలో అన్నీ బయటపడతాయి. దీన్ని అర్థం చేసుకోవడంలో న్యాయమూర్తి పొరపడ్డారు. విచారణ ముగిశాక ఈ వ్యాఖ్యలు చేస్తే ఇబ్బంది ఉండేది కాదు. ఈ లావాదేవీలు చట్టబద్ధమైన మోసం. కేసు ప్రారంభదశలోనే ఉంది. కొట్టివేసే దశలో కాదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని విచారణ చేపట్టేందుకు నోటీసులివ్వండి’ అని ధర్మాసనానికి విన్నవించారు.

రాజధాని వస్తుందనే రహస్యాన్ని దాచారు
అనంతరం ఫిర్యాదుదారు సలివేంద్ర సురేష్‌ తరపున సీనియర్‌ న్యాయవాది పరాస్‌ కుహద్‌ వాదనలు వినిపించారు. ‘ఐపీసీ సెక్షన్‌ 415లోని ప్రధాన అంశాలను హైకోర్టు విస్మరించినట్లు కనిపిస్తోంది. రాజధాని ఆ ప్రాంతానికి వస్తుందనే రహస్యాన్ని దాచి, చట్టబద్ధమైన నియమాలేమీ పాటించకుండా భూములు కొన్నారు. రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలోని 14 గ్రామాల పరిధిలో వస్తుందని, తొలిదశలో 30 వేల ఎకరాలు సేకరిస్తారని 2014 అక్టోబరులో ఓ తెలుగు పత్రికలో, కృష్ణా నదికి దక్షిణాన గుంటూరు జిల్లాలోని 17 గ్రామాల్లో ఏర్పడుతుందని ఓ ఆంగ్ల పత్రికలో కథనాలు వచ్చాయి. రాజధానిపై ఊహాగానాలకు తెరపడిందంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకొని హైకోర్టు తీర్పివ్వడం సరికాదు. 2014 డిసెంబరు 30న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) నోటిఫికేషన్‌ వచ్చింది. అంటే ఆ రోజు వరకు రాజధాని ఎక్కడొస్తుందనేది తెలియదు. సంబంధిత రాజకీయ నేతలు, అధికారులు, వారి బంధువులు ముందే తెలుసుకొని భూములు కొన్నారు. విశ్వసనీయ సమాచారాన్ని అధికారులు బయటకు వెల్లడించకూడదు. వాటితో లబ్ధి పొందకూడదు. మా వాదనను పరిగణనలోకి తీసుకోండి’ అని కోరారు.

ఆరేళ్ల తర్వాత.. మూడో వ్యక్తి పిటిషన్‌ వేస్తారా?
ప్రతివాది గురుమురళీ మోహన్‌ తరపున సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ వాదనలు వినిపించారు. ‘హైకోర్టు వాస్తవాలను పరిశీలించి పారదర్శకంగా, సమతూకంగా, వాస్తవంగా తీర్పిచ్చింది. అంతర్గత సమాచారం తెలిసి చేస్తే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అవుతుంది. అదేం లేనప్పుడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనడం చట్టపరంగా సరికాదు. ఇక్కడ అమ్మినవారు ఎవరైనా ఫిర్యాదు చేశారా? సొమ్ము చెల్లింపుల్లో సమస్యలున్నాయా? అమ్మకందారులు తమ ప్రయోజనాల కోసమే అమ్ముకున్నారు. అందువల్ల మోసం జరిగిందనే పిటిషనర్‌ వాదనకు ఆధారం లేదు. గుంటూరు సమీపంలో రాజధాని వస్తుందని.. రాజధాని గుంటూరు- విజయవాడ మధ్యలో ఉంటుందని నాయుడు (చంద్రబాబు) చెప్పారని జూన్‌ 10న ఓ ఆంగ్ల పత్రికలో వార్త ప్రచురితమైంది. ఇంత స్పష్టంగా సమాచారం ఉంటే ఇక తప్పు ఎక్కడున్నట్లు? భూముల కొనుగోళ్లపై 2020 సెప్టెంబరు 7న ఫిర్యాదు వస్తే అదే నెల 16న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఫిర్యాదుదారు భూములమ్మిన వ్యక్తి కాదు. క్రయవిక్రయదారుల మధ్య సివిల్‌ ఒప్పందాలకు సంబంధించిన అంశంలో ఏ ఇబ్బందీ లేనప్పుడు ఆరేళ్ల తర్వాత మూడోపక్షం వ్యక్తి ఎలా ఫిర్యాదు చేస్తారు? 2014 జూన్‌ తర్వాత ఆ ప్రాంతంలో ఎన్నో లావాదేవీలు జరిగినందున ఈ కేసులో విచారణ, జోక్యం అనవసరం’ అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దవే జోక్యం చేసుకొని ‘గుంటూరు- విజయవాడ మధ్య రాజధాని ఉంటుందని 2015 ఏప్రిల్‌ 23న అసలైన నోటిఫికేషన్‌ వచ్చింది. ఆరేళ్ల తర్వాత ఫిర్యాదు ఎందుకిచ్చారని ప్రతివాది న్యాయవాది ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు గత ప్రభుత్వంలోని అధికారులపై ఉన్నందున, 2019లో ప్రభుత్వం మారాక ఫిర్యాదు చేశారు. క్రిమినల్‌ కేసుల్లో ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకోరాదు’ అన్నారు.

ప్రభుత్వం మారగానే కేసులు, విచారణలా?
ప్రతివాదుల తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ ‘ఈ కేసులో ఐపీసీ సెక్షన్‌ 409ను (ప్రజాప్రతినిధులు నమ్మకాన్ని వమ్ము చేయడం) ఉల్లంఘించలేదు. అందువల్ల సెక్షన్‌406 (నమ్మకాన్ని వమ్ము చేసినందుకు శిక్ష) వర్తించదు. ఇక్కడ ప్రభుత్వం మారగానే కేసు ప్రారంభమైంది. విచారణలు మొదలయ్యాయి. 2014 ఫిబ్రవరి 18నే (రాష్ట్ర విభజనపై లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా) రాజధాని ప్రాంతంపై చర్చ జరిగింది. నాడు అధికారంలోకి వచ్చిన పార్టీ మేనిఫెస్టోలోనూ ఆ అంశం ఉంది. రాజధాని ఎక్కడుంటుందో రెండు పార్టీలకూ తెలుసు. ఈ భూముల ధరలు పెరిగి కొన్నవారు 20 రెట్లు లబ్ధి పొందారని దవే అంటున్నారు. ప్రభుత్వం మారాక రాజధానిని నిలిపేయడంతో ధర 20 రెట్లు పడిపోయి కొనుగోలుదారులు నష్టపోయారు కదా. ఆరేడేళ్ల తర్వాత పిటిషన్లు వేస్తే ఎలా? దాన్ని డిస్మిస్‌ చేయండి’ అని ధర్మాసనానికి విన్నవించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పరాస్‌ కుహద్‌ వాదించబోగా ధర్మాసనం స్పందిస్తూ.. వాదనలు ముగిశాయని, మళ్లీ ప్రారంభించవద్దని సూచించింది. ప్రభుత్వ న్యాయవాది మహఫూజ్‌ నజ్కీ జోక్యం చేసుకుంటూ అమ్మినవారు ఎస్సీలన్న విషయాన్ని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనలేదన్నారు. ప్రత్యేక ఉద్దేశంతో చేసిన ఆ ఆరోపణలను అడ్డుపెట్టుకొని వాస్తవాలను పక్కదోవ పట్టించొద్దని న్యాయవాది సిద్ధార్థ సూచించారు. ధర్మాసనంజోక్యం చేసుకొంటూ వాదనలనూ పరిగణనలోకి తీసుకున్నామని చెప్పింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది.

హైకోర్టు తీర్పులో చట్టవిరుద్ధమేమీ లేదు

హైకోర్టు ఈ కేసు వాస్తవాల లోపలికి వెళ్లకుండా తుది అభిప్రాయానికి వచ్చిందన్నట్లు పిటిషనర్లు చెబుతున్నారు. ఏ కేసులోనైనా వివరాలను పూర్తిగా పరిశీలించకుండా అది క్రిమినల్‌ కేసా? కాదా? అని నిర్ణయించడం సాధ్యం కాదనేది మా అభిప్రాయం. వాస్తవాలను పరిశీలించకుండా ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలా? వద్దా? అనే ప్రశ్న జోలికి కోర్టు వెళ్లదు. ఏ అంశంలోనైనా క్రిమినల్‌ కేసు ఉందా? లేదా? అని తేల్చడానికి కోర్టు ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని భజన్‌లాల్‌ కేసులో చెప్పారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తన తీర్పులో రికార్డు చేసిన అంశాల్లో ఎలాంటి వక్రత, చట్టవిరుద్ధం ఏమీ లేవు.

- సుప్రీంకోర్టు న్యాయమూర్తి

జస్టిస్‌ వినీత్‌శరణ్‌ స్పష్టీకరణ

ఇదీ చదవండి: 

Insider trading: ఇన్‌సైడర్ ట్రేడింగ్.. హైకోర్టు ఉత్తర్వుల్లో తప్పేముంది: సుప్రీం

Last Updated : Jul 20, 2021, 4:03 AM IST

ABOUT THE AUTHOR

...view details