ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"కేసును జాప్యం చేసేందుకు ప్రయత్నించారు... ఇక అవకాశం ఇవ్వొద్దు"

Supreme Court on illegal mining case: అక్రమ మైనింగ్‌ కేసును అవకాశం ఉన్నంత జాప్యం చేసేందుకు గాలి జనార్ధన్‌రెడ్డి సహా నిందితులు ప్రయత్నించారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇకపై అలాంటి అవకాశం ఇవ్వొద్దని, నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్లపై విచారణను ఈనెల 29లోపు ముగించాలని సూచించింది. అవకాశం ఉంటే తీర్పు కూడా ఇవ్వాలని హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఆదేశాలు ఇచ్చింది. 12ఏళ్లు అయినా కేసులో విచారణ మొదలు కాకపోవడం పట్ల అసహనం వ్యక్తం కోర్టు... దానికి గల కారణాలు చెప్పాలని హైదరాబాద్‌ సీబీఐ కోర్టును ఆదేశించింది. వాయిదాలు లేకుండా డిశ్చార్జి పిటిషన్లు తేల్చాలని ఆదేశించింది.

supreme court
అక్రమ మైనింగ్‌ కేసుపై సుప్రీంకోర్టు

By

Published : Sep 23, 2022, 12:53 PM IST

Supreme Court on illegal mining case: అక్రమ మైనింగ్‌ కేసును అవకాశం ఉన్నంత జాప్యం చేసేందుకు గాలి జనార్దన్‌రెడ్డి సహా నిందితులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఇకపై అలాంటి అవకాశం ఇవ్వొద్దని, నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్లపై విచారణను ఈనెల 29లోపు ముగించి... అవకాశం ఉంటే తీర్పు కూడా ఇవ్వాలని హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తనకు మంజూరు చేసిన బెయిల్‌ నిబంధనలు సడలించాలని గాలి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఆర్, జస్టిస్ కృష్ణమురారీలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

రెండు వారాల క్రితం కేసు విచారణకు వచ్చినప్పుడు.. పన్నెండేళ్లు అయినా.. ఇంకా ఈ కేసులో ట్రయల్‌ మొదలు కాకపోవడం పట్ల ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కేసు విచారణ త్వరతగతిన చేపట్టాలని తాము ఇచ్చిన ఆదేశాలు అమలుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దానికి గల కారణాలు చెప్పాలని, కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని హైదరాబాద్‌ సీబీఐ కోర్టును ధర్మాసనం ఆదేశించింది. అందుకు అనుగుణంగా గాలి జనార్దన్‌రెడ్డి కేసు పురోగతి, కేసు విచారణ ఆలస్యానికి కారణాలతో సీబీఐ ప్రత్యేక కోర్టు ఒక నివేదికను సీల్డ్‌ కవర్‌లో సర్వోన్నత న్యాయస్థానానికి అందించింది.

విచారణ సందర్భంగా.. సీల్డ్‌కవర్‌లో ఇచ్చిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. సీబీఐ కోర్టు ఇచ్చిన నివేదికతో ఏకీభవించింది. ఈకేసు విచారణను జాప్యం చేయడానికి నిందితులు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేశారని అభిప్రాయపడింది. ఇక ముందు అలాంటి అవకాశం ఇవ్వొద్దని ఆదేశాల్లో పేర్కొంది. వాయిదాలు లేకుండా డిశ్చార్జి పిటిషన్లను తేల్చాలని ఆదేశిస్తూ ఈ ఉత్తర్వులు వెంటనే హైదరాబాద్ సీబీఐ కోర్టుకు చేరేలా చూడాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. గాలి జనార్దన్‌ రెడ్డి తరుపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు ఈకేసు విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ఉత్తర్వుల్లో తెలిపింది.

ఈలోపు సంబంధిత నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జి అప్లికేషన్లపై విచారణ ముగించాలని ప్రత్యేక కోర్టును ఆదేశింది. ఇందులో వైఫల్యానికి తావులేదని.. ఒకవేళ సాధ్యమైతే ఆ డిశ్చార్జి అప్లికేషన్లపై తీర్పు కూడా వెలువరించాలని సీబీఐ కోర్టును ఆదేశించింది. ఈ దరఖాస్తులు దాఖలు చేసిన నిందితులు ఎవ్వరికీ ప్రత్యేక కోర్టు వాయిదాలు ఇవ్వడానికి వీల్లేదన్న సుప్రీంకోర్టు.. ఐపీసీ సెక్షన్ 120-బి, 379, 420, 427, 447, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(డి)ల కింద 2009లో దాఖలైన కేసుల విచారణను జాప్యం చేయడానికి నిందితులు అన్నిరకాల ప్రయత్నాలు చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ నిబంధనలు సడలించవద్దని, పిటిషన్‌ తిరస్కరించాలని ఇప్పటికే సీబీఐ.. సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. బెయిల్​పై వచ్చినప్పటి నుంచి గాలి జనార్దన్‌రెడ్డి కేసు విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని, సాక్షులను బెదిరిస్తున్నారని సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details