రెండు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై దాఖలైన కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఉద్యోగుల విభజన విషయంలో మరో కమిటీని నియమించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ ధర్మాధికారి నివేదికను సవాల్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ డిస్కంలు, విద్యుత్ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం... సమస్య పరిష్కారం కోసమే కమిటిని నియమించామని, ఇంకో కమిటి ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించింది.
స్థానికత ఆధారంగా ఉద్యోగుల నియామకం జరగాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 52, 48 నిష్పత్తిలో ఉద్యోగుల విభజన జరగాల్సి ఉంటే.. అలా కాకుండా 655 మంది ఉద్యోగులను ఏపీకి కేటాయించడం ఆమోదయోగ్యం కాదని ఏపీ డిస్కంల తరపు న్యాయవాది నీరజ్ కౌషల్ కోర్టుకు వివరించారు. తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగులను ఏపీకి కేటాయించారని, అదే ఏపీలో పని చేస్తున్న వారిని ఒక్కరిని కూడా తెలంగాణకు కేటాయించలేదన్నారు. ఉద్యోగుల సంఖ్య పెరగడంలో తమకు భారం పెరుగుతుందని.. జస్టిస్ ధర్మాధికారి కమిటీ విధి విధానాల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు.