ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శానిటైజర్ల మాటున మాదకద్రవ్యాల సరఫరా - hyderabad crime news

మాదకద్రవ్యాల సరఫరాలో కీలకపాత్ర పోషిస్తున్న నిందితుల కోసం తెలంగాణ రాష్ట్రంలోని అబ్కారీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్​ అధికారులు వేట ప్రారంభించారు. ఇప్పటికే మూడు కేసుల్లో ఏడుగురిని అరెస్టు చేసి.. పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్న నిందితుల అరెస్టుకు చర్యలు ప్రారంభించారు. మరో వైపు మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారికి నోటీసులు ఇచ్చి విచారించే ప్రక్రియ కొనసాగుతోంది.

supply-of-drug-traffickers-delivery-of-sanitizers-in-hyderabad
శానిటైజర్ల మాటున హాషిష్​ ఆయిల్ సరఫరా

By

Published : Jun 26, 2020, 2:07 PM IST

హైదరాబాద్‌ నగరంలో మాదకద్రవ్యాల విక్రయ ముఠాలు రెచ్చిపోతున్నాయి. గతంలో నైజీరియన్లే సరఫరా ముఠాలుగా ఉండేవారు. నిఘా పెరగడం వల్ల వారంతా తెరవెనక్కి వెళ్లారు. డ్రగ్స్‌ వినియోగదారులకు అదనపు ఆదాయం ఆశచూపి.. వారితోనే విక్రయాలు చేయిస్తున్నట్లు ఇటీవల విచారణలో వెల్లడయింది. కొవిడ్‌ ప్రభావంతోనూ గుట్టుచప్పుడు కాకుండా నగరానికి మాదకద్రవ్యాలను తరలించి.. సాధారణ రోజులు కంటే రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మే 14న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న యూసుఫ్‌గూడ నివాసి సాయి శ్రీనివాస్‌ను తెలంగాణ రాష్ట్రంలోని అబ్కారీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్​ ఏఈఎస్‌ అంజిరెడ్డి బృందం అదుపులోకి తీసుకుంది. వారి నుంచి 2.83 కిలోల చరాస్‌తో పాటు గంజాయి ఆకుల నుంచి తీసిన 25 ఎంఎల్‌ హషిష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తొలుత గంజాయికి బానిసై.. అనంతరం వ్యాపారి అవతారమెత్తాడు. అంతలోనే అధికారులకు చిక్కాడు.

అనంతరం విశ్వసనీయ సమాచారంతో ఈ నెల 21న ఎస్‌ఆర్‌నగర్‌ సమీపంలోని మధురానగర్‌లో మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 105 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్‌, 25 ఎంఎల్‌ హషిష్‌ ఆయిల్‌, 250 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

మధురానగర్‌కు చెందిన భరత్‌ టుక్రాల్‌, బల్కంపేటకు చెందిన రాణాప్రతాప్‌, బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌ బస్తీకి చెందిన ఫెరోజ్‌ అహ్మద్‌లు మత్తుకు బానిసలై.. ఇతరులకు చేరవేసే క్రమంలో అధికారులకు చిక్కారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఏడు మొబైల్‌ ఫోన్‌లను పరిశీలించగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.

రంగంలోకి ప్రత్యేక బృందాలు..

బోరబండకు చెందిన అఖిల్‌ ఆదిత్య హాషిష్​ ఆయిల్‌ను కొనుగోలు చేసినట్లు వారు వెల్లడించారు. ఈనెల 22న ఎస్‌ఆర్‌నగర్‌లో అఖిల్‌ ఆదిత్య, జి.ఫణిలు అబ్కారీ శాఖ అధికారులకు మాదకద్రవ్యాలతో దొరికారు. వారి నుంచి 2.1 లీటర్ల హషిష్‌ ఆయిల్‌, 410 గ్రాముల చరాస్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్‌లోని అరకు, చెన్నై, ముంబయి, దిల్లీలో ఉన్నందున వారిని అరెస్టు చేసేందుకు వెళ్లే ప్రత్యేక బృందాలకు అవసరమైన పాలనాపరమైన అనుమతులు తీసుకోనున్నారు.

వినియోగదారులే..

మాదకద్రవ్యాల సరఫరాలో కీలకంగా ఉండే నైజీరియన్ల పాత్ర ప్రస్తుతం చిక్కిన మూడు ముఠాల్లో కనిపించలేదు. నిందితులంతా గతంలో మత్తుకు అలవాటు పడిన వారేనని అధికారులు దర్యాప్తులో తేలింది. వీరికి మాదక ద్రవ్యాలను చేరవేస్తున్న నలుగురిని కూడా అరెస్టు చేస్తే మరింత సమాచారం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

గంజాయి ఆకుల నుంచి..

కొత్తగా హాషిష్​ ఆయిల్‌ను శానిటైజర్ల మాటున తెస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. దానిని సరఫరా చేస్తున్న నిందితుడు అరకు ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. గంజాయి తరలింపుపై గట్టి నిఘా ఉండడం వల్ల.. గంజాయి ఆకుల నుంచి తీసిన ద్రవాన్ని తరలించి ఎక్కువ సంపాందిస్తున్నారు. ఇది మరింత మత్తుగా ఉండడం వల్ల యువత ఎక్కువుగా మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ద్రవాన్ని దళసరి కాగితానికి అతికించి ఇవ్వడం.. సిగరెట్​పై పూతగా వినియోగిస్తున్నట్లు అబ్కారీ అధికారులు గుర్తించారు.

ఈ ఆయిల్‌ను సరఫరా చేస్తున్న కీలక నిందితుడిని అరెస్టు చేయడం ద్వారా తాత్కాలికంగానైనా సరఫరాకు అడ్డుకట్ట వేయగలమని తెలంగాణ రాష్ట్రం అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు చిక్కిన ఏడుగురు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న చరవాణుల సమాచారాన్ని పరిశీలించారు. ఎవరెవరికి సరఫరా చేశారనే వివరాలు తెలిసినట్లు సమాచారం. వీరందరూ వినియోగదారులు అయినందున.. నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. అవసరమైన వారికి కౌన్సెలింగ్​ ఇచ్చి ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

ఎక్సైజ్‌ స్టేషన్ల వారీగా మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారి వివరాలను తెలుసుకుని.. వారి కదలికలపై కన్నేసి ఉంచారు. వారంతా డ్రగ్స్‌ నుంచి బయట పడ్డారా లేదా అన్న కోణంలో నిఘా పెట్టారు. ఒక వేళ మత్తు మందులకు అలవాటు పడి.. వ్యాపారులుగా మారినట్లుయితే వారిపై గట్టి నిఘా పెట్టి.. ఆధారాలతో అరెస్టులు చేయాలని భావిస్తున్నారు. దీనిపై లోతైన దర్యాప్తునకు ప్రత్యేక విచారణ అధికారిని ఒకటి రెండు రోజుల్లో నియమించే అవకాశం ఉంది.

ఇవీచూడండి:డ్రగ్స్ డాన్​ కోసం పోలీసుల స్కెచ్- 10 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details