దిగ్గజ ఔషధ సంస్థ సన్ ఫార్మా రాష్ట్రంలో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుందని ప్రభుత్వం పేర్కొంది. సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో సంస్థ ఎండీ దిలీప్ సంఘ్వీ మంగళవారం కలిసి చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పరిశ్రమలకు పారదర్శకంగా అనుమతులిస్తాం’ అని పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధితో పాటు.. పర్యావరణహిత విధానాలపై సీఎం ప్రత్యేక దృష్టితో ఉన్నారని సన్ ఫార్మా అధినేత సంఘ్వీ తెలిపారు.
సీఎంను కలిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై సీఎంకు అవగాహన ఉంది. పారిశ్రామికాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు సీఎం ప్రయత్నిస్తున్నారు. ఔషధ రంగంపై మా ఆలోచనలను సమావేశంలో వివరించాం’ అని పేర్కొన్నారు. కంపెనీ ప్రతినిధులు విజయ్ పారీఖ్, సౌరభ్ బోరా, విద్యాసాగర్ పాల్గొన్నారు.