ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హోదా పేరుతో ప్రజలను వైకాపా మభ్యపెట్టింది: సుజనా - భాజపా ఎంపీ

వైకాపా వందరోజుల పాలన తీరుపై భాజపా ఎంపీ సుజనా చౌదరి తీవ్రంగా విమర్శలు చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో 119 విజయాలపైనా సుజనా ప్రశ్నలు సందించారు.

హోదా పేరుతో వైకాపా ప్రజలను మభ్యపెట్టింది : భాజపా ఎంపీ సుజనా చౌదరి

By

Published : Sep 7, 2019, 8:50 PM IST

హోదా పేరుతో వైకాపా ప్రజలను మభ్యపెట్టింది : భాజపా ఎంపీ సుజనా చౌదరి

అధికారంలోకి రాక ముందు జగన్ ఏం చెప్పారు.. వందరోజుల పాలనలో ఏం చేశారని కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు. హైదరాబాద్​లో మాట్లాడిన ఆయన వైకాపా వందరోజుల పాలన తీరుపై విమర్శలు చేశారు. అధికార పార్టీ నేతలు ఇసుకను నల్లబజారులో అమ్ముకుంటున్నారన్న ఆయన.. లక్షల ఉద్యోగాలను వైకాపా కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలు నిలుపుదల, పేదలకు సన్నబియ్యం, చిన్న సమస్యలకు 72 గంటల్లో పరిష్కారం ఇలా ఏ ఒక్క హామీ నెరవేరలేదని విమర్శించారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలకు పెంచిన జీతాలు ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

సరైన ప్రణాళికలు లేకుండా కడప ఉక్కు పరిశ్రమ ఎలా సాధ్యమన్న సుజనా... గత పథకాలకే పేర్లు మార్చారని ఎద్దేవా చేశారు. హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలు ఏపీ నుంచి పారిపోతున్నారని విమర్శించారు. సింధు, సాయిప్రణీత్‌కు సీఎం అపాయింట్‌మెంట్ సైతం ఇవ్వలేదన్నారు. అక్రమ నిర్మాణాలు, కట్టడాలు అరికడతామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజావేదిక, ప్రత్యర్థుల కార్యాలయాలు తప్ప ఏదైనా కూలగొట్టారా? అని నిలదీశారు. వైకాపా పాలనలో పనుల్లేక వేలమంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. అన్న క్యాంటీన్లు ఆపేసి పేదవాళ్ల నోటిదగ్గర కూడు లాగేశారన్నారు.

ABOUT THE AUTHOR

...view details