ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Loan apps: రుణ యాప్‌ల ఆగడాలు.. ఉసురు తీసుకుంటున్న బాధితులు

Loan Apps Case : ఒకటి కాదు రెండు కాదు రుణ యాప్‌ల ఆగడాలకు సంబంధించి ఎన్నో ఉదంతాలు. ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. వారి అరాచకపర్వానికి బాధితులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అవసరానికి డబ్బు తీసుకుని వడ్డీతో సహా తిరిగి చెల్లించినా.. రుణయాప్‌ల నిర్వాహకులు మాత్రం పాడు బుద్ధిని చూపించడం ఆపడంలేదు. అసభ్యకర రీతిలో, పరువు పోయేలా మెసేజ్‌లు చేస్తూ.. రుణాలను తీసుకున్న వారిని మానసికంగా వేధిస్తున్నారు.

Loan apps
Loan apps

By

Published : Jul 4, 2022, 5:03 AM IST

‘ఈయన పేరు --------. ఫోన్‌ నంబర్‌ -----. పెద్ద మోసగాడు. చిన్నారుల హంతకుడు. మీ చుట్టూనే తిరుగుతున్నాడు. మీ కుటుంబసభ్యుల్ని ఈ వ్యక్తి బారి నుంచి రక్షించుకోండి. ఎక్కడైనా కనిపిస్తే ఈ కింది నంబర్‌కు కాల్‌ చేయండి. ఇంటి యజమానిని కూడా చంపేసిన ఇతణ్ని నేరుగా పట్టిస్తే నగదు బహుమతి కూడా ఇస్తాం.’

- ఇది ఎవరో పెద్ద నేరగాణ్ని పట్టుకునేందుకు పోలీసులు విడుదల చేసిన ప్రకటనలా అనిపిస్తోంది కదా! కానే కాదు. ఆన్‌లైన్‌ యాప్‌ల్లో రుణం తీసుకున్న వ్యక్తి దాన్ని సకాలంలో చెల్లించనందుకు ఆయా యాప్‌ల నిర్వాహకులు ఎంత బరితెగించి వేధిస్తున్నారో చెప్పడానికి పరాకాష్ఠ. రుణగ్రహీత ఫొటోను మార్ఫింగ్‌ ద్వారా నగ్నంగా మార్చి దాన్ని అతని కాంటాక్ట్‌ నంబర్లు అన్నింటికీ వాట్సప్‌లో పంపించటం, బతికుండగానే అతని ఫొటోకు దండేసి చనిపోయినట్లు ప్రచారం చేయటం.. ఇలా ఒకటేమిటి రుణయాప్‌ల నిర్వాహకుల ఆగడాలు అన్నీఇన్నీ కావు. అత్యంత హేయంగా, క్రూరంగా వారు వేధిస్తుంటే అప్పులు తీసుకున్న వేలాది మంది తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు. కొందరు తమలో తామే కుమిలిపోతూ బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. ఇంకొందరు ఆ అప్పులు తీర్చేందుకు మరికొన్ని యాప్‌ల్లో రుణాలు తీసుకుంటూ మరింతగా ఆ ఊబిలో కూరుకుపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం పట్టణానికి చెందిన కోనా సతీష్‌ తాజాగా ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో రుణయాప్‌ల దందా మరోమారు చర్చనీయాంశమైంది.

‘మీ మొబైల్‌ ఫోన్‌లో ఒకే క్లిక్‌తో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఎలాంటి హామీ లేకుండానే రుణం పొందండి’ అంటూ రుణ యాప్‌ల నిర్వాహకుల ప్రకటనలతో మిమ్మల్ని ఊదరగొట్టేస్తారు. అత్యవసరమై వాటిలో అప్పు తీసుకుంటే చాలు ఊబిలోకి దిగినట్లే. అప్పు తీసుకున్న వారిని నిర్వాహకులు జలగల్లా పట్టిపీడిస్తున్నారు. చెల్లింపు ఒక్క గంట ఆలస్యమైనా రుణగ్రహీతల్ని, వారి కుటుంబసభ్యుల్ని, బంధుమిత్రుల్ని రకరకాలుగా బెదిరిస్తూ తీవ్ర క్షోభకు గురిచేస్తున్నారు. అయినా సరే అత్యవసర పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవించేవారు వీటిని ఆశ్రయిస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

పాతవే.. కొత్త పేర్లతో
ఏడాదిన్నర కిందట కూడా ఈ రుణయాప్‌ల మోసాలకు, వేధింపులకు వేల మంది అవస్థలు పడ్డారు. అప్పట్లో కొన్ని యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించటంతో వాటి నిర్వాహకులే ఇప్పుడు కొత్త కొత్త పేర్లతో తెరపైకి వచ్చి దందా చేస్తున్నారు. క్యాష్‌ బస్‌, లెండ్‌ మాల్‌, క్యాష్‌ అడ్వాన్స్‌, రుపీ కింగ్‌, రుపీ బాక్స్‌, ఓకే, సన్‌షైన్‌ లోన్‌, మనీ గ్రాంట్‌, భారత్‌ లోన్‌, మనీ గ్రాంట్‌, గోల్డ్‌ సీ లెండ్‌ మాల్‌, భారత్‌ క్యాష్‌, క్యాష్‌ చెర్రీ లెండ్‌, రోజ్‌ లెండ్‌, స్మాల్‌ క్యాష్‌, ఎక్స్‌పీ క్యాష్‌, మనలీ మాస్టర్‌, లెండ్‌ కింగ్‌, లెండ్‌ ఫాస్ట్‌, కోకో ఫాస్ట్‌, కోకో లెండ్‌ వంటి పేర్లతో ఇప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు.

అన్నింటికీ యాక్సెస్‌ ఇస్తేనే..
ఈ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడే మీ ఫోన్‌లోని కాంటాక్ట్‌ నంబర్లు, ఫొటోలు, వీడియోలు సహా అన్నింటి యాక్సెస్‌ యాప్‌ నిర్వాహకులకు ఇవ్వాలి. లేదంటే రుణం పొందలేరని షరతు పెడతారు. యాక్సెస్‌ ఇవ్వగానే మీ ఫోన్‌ రుణ యాప్‌ సర్వర్‌కు అనుసంధానమవుతుంది. దీంతోపాటు అప్పు తీసుకునేటప్పుడు షరతులు, నిబంధనలను చదవకుండానే చాలామంది అంగీకరిస్తున్నారు. ఇవన్నీ వారిని సమస్యల సుడిలోకి నెట్టేస్తున్నాయి. రుణం తీసుకున్న ఆరో రోజు నుంచే చెల్లింపుల కోసం యాప్‌ నిర్వాహకులు ఒత్తిడి తెస్తారు. గంటగంటకూ ఫోన్లు చేస్తుంటారు. చెల్లింపు ఆలస్యమవుతున్న కొద్దీ వారి వికృతరూపాన్ని బయటపెడతారు. రుణగ్రహీత ఫోన్‌లోని నంబర్లన్నింటికీ వారి ప్రతిష్ఠకు భంగం కలిగించే పోస్టులు, దుష్ప్రచారాలతో కూడిన సందేశాలు, చిత్రాలు పంపిస్తారు.

వడ్డీ కాదది ఉరితాడు
ఆన్‌లైన్‌ రుణ యాప్‌ల్లో వడ్డీ మన ఊహకు అందనంత భారీగా ఉంటుంది. దాదాపు అన్ని యాప్‌లు 32 నుంచి 42 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. కొన్ని యాప్‌లైతే 50 శాతం వరకూ వడ్డీ లాగుతున్నాయి. చెల్లించాల్సిన వడ్డీ సొమ్ము ముందే మినహాయించుకుని మిగతా మొత్తాన్నే రుణగ్రహీత ఖాతాలో వేస్తారు. ఉదాహరణకు రూ.7 వేలు రుణం తీసుకుంటే రూ.5,800 ఇస్తారు. వారం రోజుల్లో రూ.8,100 కట్టాలి.

* కొన్ని సందర్భాల్లో ఒక యాప్‌లో చేసిన అప్పు తీర్చటానికి మరో యాప్‌ నుంచి అప్పు ఇప్పిస్తారు. ఇలా ఆ చక్రబంధంలో బాధితులు కూరుకుపోతున్నారు. బాధితుల్లో మహిళలే అధికం.

చట్టమే కొండంత అండ
రుణయాప్‌ల ప్రతినిధులు అప్పు తీసుకున్న వారిని బెదిరించడం, వేధించడం అన్నీ నేరాలే. అలాంటివి మీకు ఎదురైతే భయపడొద్దు. చట్టపరంగా చర్యలు తీసుకోమని పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఈ కింద పేర్కొన్న సెక్షన్ల ప్రకారం వారిపై కేసులు పెట్టమని అడగాలి.

వేధింపుల్లో అత్యంత క్రూరత్వం

అప్పు తీసుకున్న వారిని రుణయాప్‌ల నిర్వాహకులు అత్యంత క్రూరంగా వేధిస్తున్నారు.

* ‘నా ఆర్థికపరిస్థితి సరిగా లేక తీసుకున్న రుణం చెల్లించలేకపోయా. నా కుటుంబంలోని మహిళల్ని మీ వద్దకు పంపిస్తా. మీరు వారితో గడిపి నా అప్పు తీర్చండి’ అంటూ రుణం తీసుకున్న వ్యక్తి పంపించినట్లుగా నకిలీ మెసేజ్‌లు రూపొందిస్తారు. వాటిని అతని కాంటాక్ట్‌ లిస్ట్‌లోని నంబర్లన్నింటికీ పంపిస్తున్నారు.

* తనకు కుటుంబసభ్యులతోనే అనైతిక లైంగిక సంబంధాలున్నట్లు అప్పు తీసుకున్న వ్యక్తి పేరుతోనే అతనిపై తప్పుడు ప్రచారం చేస్తారు.

* మహిళలైతే.. వారి చిత్రాల్ని మార్ఫింగ్‌ చేసి అశ్లీల వెబ్‌సైట్లలో పెడతామని బెదిరిస్తున్నారు. ఓ మహిళ రుణం చెల్లించనందుకు ఆమె ఫోన్‌ నంబర్‌ను యాప్‌ నిర్వాహకులు కొందరు యువకులకు ఇచ్చారు. వారు ఆమెకు ఫోన్లు చేస్తూ అసభ్యకరంగా దూషించారు.

* అప్పు తీసుకుని చెల్లించని పురుషుల ఫొటోల్లో తలల్ని నగ్న చిత్రాలకు అతికించి, ఆ చిత్రాల్ని అతని ఫోన్‌లో ఉన్న నంబర్లన్నింటికీ పంపిస్తున్నారు.

* బాధితులు ఆత్మహత్యకు పాల్పడినా వేధింపులు ఆగవు. తాజాగా ఆత్మహత్య చేసుకున్న కోనా సతీష్‌ కుటుంబసభ్యులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

ఇదీ చదవండి:అప్పు చెల్లించినా బ్లాక్‌మెయిల్.. ఫొటో మార్ఫ్‌ చేస్తామంటూ బెదిరింపులు!

ట్రెడిషనల్​గా అనసూయ, రష్మి, శ్రీముఖి.. చూస్తే రెండు కళ్లు చాలవ్​!

టీచర్​తో స్టూడెంట్​ అఫైర్​.. అలా చేయమన్నందుకు రాడ్​తో కొట్టి!

ABOUT THE AUTHOR

...view details