తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలోని వేములపల్లి రాజు కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. 4 రోజుల క్రితం ఆ ఇంట్లో మంటలు చెలరేగి టీవీ, మొబైల్ ఫోన్, సెల్ఫ్లో చెద్దర్లు కాలిపోయాయి. మంటలను గమనించిన ఇంట్లోని వారు వెంటనే మంటలను ఆర్పివేశారు. రెండవ రోజు కిచెన్లో, వరండాలోని ఫ్రిజ్పైన ఉన్న దుస్తులు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ తో కాలిపోతున్నాయని వారు భావించారు.
వెంటనే ఇంట్లోని వస్తువులన్నీ ఆరుబయట రేకుల గుడిసెలో ఉంచారు. మూడవరోజు రేకుల గుడిసెలోని ఓ బ్యాగులో, స్నానాల గదిలో విడిచిన బట్టల్లో మంటలు చెలరేగి బట్టలు కాలిపోయాయి. స్నానాల గదికి విద్యుత్ సరఫరా కూడా లేదు. మరి ఎలా కాలిపోయాయో అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగవ రోజు వంట గదిలో తలుపుకు తగిలించిన ఉల్లిగడ్డల కవరులో, ఇంటి ముందు కొట్టం పైన ఉన్న తాటాకులపై మంటలు వచ్చి కాలిపోతుండగా.. గమనించిన వారు వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ పరిణామాలతో ఆ ఇంటి వారంతా చెట్టు కిందే ఉంటూ మంటలు ఎలా వస్తున్నాయో తెలియక క్షణం... క్షణం భయం భయంగా గడుపుతున్నారు.