సమస్త జీవులకు నీరే ప్రాణాధారం. అలాంటి నీటికి కాలుష్యంతో వచ్చే అనర్థాలు ఇన్నీ అన్నీ కావు. సముద్ర జలాలు విషతుల్యాలమై పెరిగి మానవాళి మనుగడ సంక్లిష్టంగా మార్చేశాయి. ముఖ్యంగా మత్స్య సంపద కాలుష్య కోరల్లో పడి విలవిల్లాడిపోతోంది. వాతావరణ పరిస్థితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది అని సంస్థ ప్రతినిధులు చెప్పిన మాటలు నన్ను ఆలోచింపజేశాయి. ఈ దిశగా అందరిలోనూ చైతన్యం కలిగించాలని నిర్ణయించుకున్నా. నేను తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నా. మా వారు ప్రదీప్‌తో కలిసి వ్యవసాయ పనులు చేసుకునేదాన్ని. పర్యావరణ కాలుష్యం, రసాయన పంటల గురించి చాలాసార్లు విన్నప్పటికీ ఎలా అడ్డుకట్ట వేయాలో తెలిసేది కాదు.
మా ఊరు అంతర్వేది సాగర సంగమ ప్రదేశంగానే కాకుండా ప్రసిద్ధ లక్ష్మీనృసింహ దివ్యక్షేత్రం కూడా. నిత్యం భక్తులు, పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఫిషింగ్ హార్బర్ ఉంది. పెద్ద సంఖ్యలో మత్స్యకారులు చేపల వేటకొస్తుంటారు. ఇక్కడే అసలు సమస్య ఉంది. వీటన్నింటి వల్ల అందమైన మా ఊరి సాగర తీరం కలుషితమైపోయింది. దీనికి ప్రధాన కారణం ప్లాస్టిక్ వ్యర్థాలే. ఇవి నదీ జలాల ద్వారా సముద్రంలోకి పెద్ద ఎత్తున చేరడంతో నీళ్లు విషతుల్యమవుతున్నాయి. దీని ప్రభావం మత్స్య సంపదపైనా పడింది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. గత ఫిబ్రవరిలో మా ఊరిలో గ్రీన్ వార్మ్, స్మార్ట్ విలేజ్ మూవ్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సహకారంతో జీరో వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టును ప్రారంభించారు. స్వతహాగా పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి ఉన్న మేం మొదట ఉపాధి కోసమే ఇందులో చేరాం.
ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి...