తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ మహిళ మరియమ్మ లాకప్ డెత్ వ్యవహారంలో ఎస్సై సహా ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మరియమ్మను దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె పోలీసు కస్టడీలో మృతి చెందింది. ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో... విచారణ జరిపిన రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఎస్సై మహేష్, కానిస్టేబుళ్లు జానయ్య, రషీద్ పటేల్‌ను సస్పెండ్ చేశారు. తాజాగా వారి ముగ్గురిని మహేష్ భగవత్ సర్వీసు నుంచి తొలగించారు.
ఈ కేసుపై గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డిలు సీరియస్ అయ్యారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు పూర్వపరాలను తెలుసుకుని... అవసరమైతే బాధ్యులను ఉద్యోగం నుంచి తొలగించాలని సీఎం కేసీఆర్ డీజీపీని ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం డీజీపీ మహేందర్ రెడ్డి ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. లాకప్‌డెత్‌కు గురైన మరియమ్మ కుటుంబాన్ని డీజీపీ పరామర్శించి.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే...
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో మరియమ్మ అనే ఎస్సీ మహిళ మృతిచెందటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన మరియమ్మ.. యాదాద్రి జిల్లా గోవిందాపురంలో చర్చి పాస్టర్ బాలశౌరి ఇంట్లో వంటమనిషిగా పనిచేశారు. జూన్ 3న ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌తో పాటు అతడి స్నేహితుడు శంకర్.. గోవిందాపురం వచ్చారు. జూన్ 5న ఫాదర్ పని మీద హైదరాబాద్ వెళ్లారు. మరుసటి రోజు వచ్చేసరికి... ఇంట్లో 2 లక్షలు మాయమైనట్లు గుర్తించారు.