waiting for Canada VISA ఉన్నతవిద్య కోసం కెనడా వెళ్లాల్సిన విద్యార్థులు వీసాల కోసం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సి వస్తోంది. ఇప్పటికే అక్కడి విశ్వవిద్యాలయాలు తరగతుల ప్రారంభ తేదీలను ప్రకటించాయి. దీంతో వీసాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావాలనుకున్నా ఆ అవకాశం లేకుండా పోయింది. సెప్టెంబరులో తరగతులు ప్రారంభమయ్యే విద్యాసంస్థలకు ఈనెల 25లోపే సమాచారం అందించాలి. కానీ, వీసాలు రావట్లేదు. సాధారణంగా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (ఎస్‌డీఎస్) కింద వీసాలు వేగంగా వస్తాయి.
ఈ విధానంలో దరఖాస్తు చేస్తే గతంలో రెండు, మూడు వారాల్లోనే వీసా వచ్చేదని, ఇప్పుడు 6-8 నెలల సమయం పడుతోందని విజయవాడలోని ఓ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వెల్లడించింది. ఎస్‌డీఎస్ అనేది ఫాస్ట్‌ట్రాక్ మార్గం. ఈ విధానంలో వీసా తిరస్కరణలు తక్కువ. దీనికింద విద్యార్థి ఏడాది ట్యూషన్ ఫీజుతోపాటు.. స్టూడెంట్స్ క్యాడ్ కింద కొంత మొత్తం డిపాజిట్ చేయాలి. విద్యార్థికి ఐఈఎల్‌టీఎస్ స్కోరు 6 నుంచి 6.5 వరకు ఉండాలి. కెనడా విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ముందుగానే రుణాలు తీసుకుని ట్యూషన్ ఫీజులు చెల్లించారు. జూన్‌లో రుణం తీసుకున్న లక్ష్మీసాయికి ఇప్పటికీ వీసా రాలేదు. కానీ, బ్యాంకులు వాయిదా చెల్లించాలని కోరుతున్నాయి. కోనెస్టోగా, నార్తర్న్‌లాంటి కళాశాలల్లో ప్రవేశాలకు ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.10లక్షలు, బ్రిటిష్ కొలంబియా, టొరంటో, మెక్‌గిల్ లాంటి విద్యాసంస్థలకు రూ.35-40 లక్షల ఫీజు చెల్లించారు. స్టూడెంట్ క్యాడ్ కింద నివాస, వసతి కోసం 10వేల కెనడియన్ డాలర్లు డిపాజిట్ చేశారు.