విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించారు. ఎయిడెడ్ కళాశాలల ప్రైవేటీకరణ, ఉపకార వేతనాల మంజూరు సమస్యలపై నిరసనలు చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. బారికేడ్లు తోసుకుని కొందరు విద్యార్థులు కలెక్టరేట్ ప్రాంగణంలోకి వెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థులను పోలీసులు పక్కకు నెట్టివేశారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు.. జిల్లా కలెక్టర్ బయటకు వచ్చి తమ సమస్యలు వినాలంటూ నినాదాలు చేశారు. విజయనగరం, గుంటూరులోనూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లాలో..
ఎయిడెడ్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. గుంటూరులో ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లగా.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుని.. పలువురిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.