ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

DIGITAL CLASSES: మారుమూల ప్రాంతాలకు చేరని డిజిటల్‌ పాఠాలు

తెలంగాణలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడిచింది. బడులు తెరిచినా పిల్లలెవరూ పాఠశాలలకు రావొద్దని.. ఇంటి వద్దే ఉంటూ దూరదర్శన్‌, టీశాట్‌, సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌, యూట్యూబ్‌ ద్వారా పాఠాలు వినాలని ప్రభుత్వం సూచించింది. ఇంతవరకు బాగానే ఉన్నా నెట్‌వర్క్‌ లేని మారుమూల ప్రాంతాల్లో ఆన్‌లైన్‌(online classes) విద్య మిథ్యగా మారుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

DIGITAL CLASSES IN TELANGANA
DIGITAL CLASSES IN TELANGANA

By

Published : Jul 7, 2021, 11:45 AM IST

నాగరికతకు దూరంగా విసిరేసినట్లుగా ఉండే ఆవాసాలు.. కిలోమీటర్ల దూరం కాలినడకన తప్ప వెళ్లేందుకు రవాణా మార్గం లేని పల్లెలు, కొండలు, కోనలు.. శివారు ప్రాంతాలు తెలంగాణ నల్గొండ జిల్లా చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లో దర్శనమిస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా విస్తరిస్తున్నా.. ప్రగతి పరుగులో వెనుకబడిన ఈ పల్లెలు నేటికీ మౌలిక సౌకర్యాలకు నోచుకోవటం లేదు. అంతర్జాలం ప్రవేశంతో ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన తరుణంలోనూ ఈ ఆవాసాలకు సాంకేతికత ఆమడదూరంలో ఉంది. ఆయా మండలాల పరిధిలోని పొగిళ్ల, గువ్వలగుట్ట, వైజాగ్‌కాలనీ, రేకులగడ్డ, చిత్రియాల, యల్మలమంద, సర్కిల్‌ వలయంలో చరవాణి సిగ్నల్స్‌ లేక ఆన్‌లైన్‌(ONLINE CLASSES) విద్య అక్కడి విద్యార్థులకు అందని ద్రాక్షగా మారింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కొన్ని తండాల్లో అక్కడక్కడా నెట్‌వర్క్‌ సమస్య(NETWORK ISSUES) తీవ్రంగా వేధిస్తోంది.

తరచూ ఆటంకాలు...

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 4,060 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 4.53 లక్షల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇళ్ల వద్దే ఉంటూ ఆన్‌లైన్‌, డిజిటల్‌ పాఠాలు వింటున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలు, గురుకులాలు, కళాశాలలు సైతం ఈనెల 1 నుంచి ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించాయి. కొవిడ్‌ మూడో దశ చిన్నారులపై ప్రభావం చూపుతోందనే హెచ్చరికల నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలకు విద్యార్థులు వెళ్లలేని పరిస్థితి. పరిస్థితులు మెరుగుపడే వరకు ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని గ్రామాలు, తండాల్లో చరవాణి పట్టుకొని కొండలు, గుట్టలు ఎక్కితే కానీ ఫోన్‌ సిగ్నల్స్‌ అందటం లేదు. అలాంటి చోట డిజిటల్‌ పాఠాలు వినటానికి తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ అందక బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతున్న ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలో...

  • కేబుల్‌, డీటీహెచ్‌ సదుపాయంతో టీవీలు ఉన్నవారు: 73,235 మంది
  • స్మార్ట్‌ఫోన్‌తో పాటు నెట్‌ సౌకర్యం ఉన్నవారు: 33,705 మంది
  • కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌తో నెట్‌ సౌకర్యం కలిగి ఉన్నవారు: 2,906 మంది
  • ఎలాంటి సౌకర్యం లేనివారు: 1,350 మంది

ఇలా చేస్తే..

  • మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం నెట్‌ సౌకర్యం కల్పించాలి.
  • సెల్‌ఫోన్‌ టవర్ల ఏర్పాటుకు ఆయా సంస్థలను ప్రోత్సహించాలి.
  • ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆన్‌లైన్‌ విద్యపై విద్యార్థులను నిరంతరం పర్యవేక్షించేలా ఉన్నతాధికారులు దృష్టి సారించాలి.

బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాం

మా గ్రామంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ సక్రమంగా రాదు. మా మండలంలో టవర్లు అంతగా లేవు. ప్రభుత్వ పథకాలకు చరవాణి నంబర్ల అనుసంధానం, తదితర పనులు చేస్తున్న క్రమంలో నెట్‌వర్క్‌ అందటం లేదు. ఇప్పటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నట్లుగానే అనిపిస్తుంది.

- కేతావత్‌ దేవ, తెల్దేవరపల్లి, చందంపేట మండలం

పిల్లల చదువులకు ఇబ్బందులు

మా మండలంలో సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ సక్రమంగా రాదు. మా ఇద్దరి పిల్లలకు ఆన్‌లైన్‌ తరగతుల దృష్ట్యా ఫోన్‌ కొనిచ్చాం. అయినా సిగ్నల్‌ లేని కారణంగా నెట్‌ రాకపోవడంతో డాబాపైకి వెళ్లి అవస్థలు పడుతుంటారు. గతేడాది డాబా ఎక్కే క్రమంలో జారి కిందపడ్డారు. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి.

- నున్సావత్‌ రాములు, చందంపేట

ఇదీ చూడండి:

phone number: నా ఫోన్ నంబర్​ నాకు ఇస్తారా? చావమంటారా?!

ABOUT THE AUTHOR

...view details