Russia-ukraine conflict: భారీ శబ్దాలతో విరుచుకుపడుతున్న రాకెట్లు, బాంబుల నుంచి రక్షణకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉక్రెయిన్‌లో ఉంటున్న తెలుగు విద్యార్థులు బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఏ క్షణానా ఎటు నుంచి ఆపద తరుముకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. వారి పరిస్థితిని తలుచుకుంటూ ఇక్కడ తల్లిదండ్రులు విలవిలలాడిపోతున్నారు.
క్షణమొక యుగం..
ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన విజయరాఘవ చదువు పూర్తిచేసుకుని ఇంకో వారం రోజుల్లో స్వస్థలానికి రానున్నారు. ఈ సమయంలో యుద్ధం తరుముకురావడంతో అక్కడే చిక్కుకుపోయాడు. టీవీలో వార్తలు చూస్తున్న కుటుంబసభ్యులు....తీవ్రంగా విలపిస్తున్నారు.
రవాణా సాధనాలు లేక
మండలంలోని తిమ్మాయపాలెంకు చెందిన అల్లంనేని విజయరాఘవ రెండు నెలల్లో చదువు పూర్తిచేసుకొని ఇంటికి రావాల్సి ఉంది. అక్కడినుంచి మాట్లాడుతూ భారత రాయబార కార్యాలయంతో ఇక్కడివారు మాట్లాడుతున్నారని, అప్పటి వరకు బయటకు రావద్దని ఉక్రెయిన్ అధికారులు చెప్పినట్లు వివరించారు.తల్లిదండ్రులు కాశయ్య, అనురాధ, చెల్లెలు రక్షితకు చరవాణి ద్వారా ప్రస్తుతం రాఘవ అందుబాటులో ఉన్నారు. వారు టీవీలో అక్కడి సంగతులు తెలుసుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
స్వస్థలాలకు చేరుకుంటాం
ఉక్రెయిన్‌లోని జపోర్జియా, డ్నిప్రో, కర్కివ్, తదితర ప్రాంతాల్లో ఉన్న జిల్లా విద్యార్థులు మాట్లాడుతూ అక్కడి విషయాలు పంచుకున్నారు. ఒంగోలు మంగమూరు రోడ్డు ప్రాంతంలో ఉన్న పాటిబండ్ల హరిబాబు కుమారుడు యశ్వంత్ వైద్యవిద్య 5వ సంవత్సరం చదువుతున్నాడు. ఇంకా ఏడాదన్నర వరకు ఉక్రెయిన్‌లో ఉండాల్సి ఉందని చెప్పారు. తల్లిదండ్రులతో రోజూ ఫోన్‌లో మాట్లాడుతున్నానని, తాను ధైర్యంగా ఉన్నానన్నారు.్ర ఒంగోలుకు చెందిన సంపంగి వెంకటేశ్ కుమారుడు కల్యాణ్‌చక్రవర్తి జపోర్జియాలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. తాను వసతిగృహంలో ఉంటున్నానని, భారత్ ఎంబసీ నుంచి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
సెల్ టవర్లు ధ్వంసమయ్యాయి
లాయర్‌పేట సాయిబాబా దేవాలయం సమీప వీధికి చెందిన ఉలిచి సాంబశివరావు, వనజల కుమారుడు శివ సంపత్ ఉక్రెయిన్ కార్క్విల్‌లోని యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. తల్లి మాట్లాడుతూ ‘‘మా అబ్బాయి ఆరేళ్లలో ఒక్కసారి వచ్చి వెళ్లాడు. ఆగస్టులో కోర్సు పూర్తిచేసుకొని వస్తాడని చూస్తున్నాం. రష్యా యుద్ధం ప్రకటించినట్లు తెలుసుకొని ఆందోళన చెందాం. అన్నం సహించడంలేదు. సెల్ టవర్లు ధ్వంసమయ్యాయని.. ఇకపై వీడియోకాల్ కుదరదని శుక్రవారం సందేశం పంపించాడు’’ అంటూ తెలిపారు.
1400 కి.మీ. వెళ్లాలి
వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ ఐటీఐ కాలనీకి చెందిన యర్రా సుబ్రహ్మణ్యం, మల్లేశ్వరిల కుమార్తె అఖిల ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె తన తల్లితో శుక్రవారం రాత్రి వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. యుద్ధం ప్రారంభమైన తొలిరోజు బంకర్‌లోనే తలదాచుకున్నామని.. శుక్రవారం వసతిగృహానికి పంపించి అవసరమైన వస్తువులు సర్దుకోమని చెప్పారన్నారు. ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నారని.. 1400 కి.మీ. దూరంలో విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉందన్నారు.
స్నేహితుడి ఇంటిలో తలదాచుకొని..
ఉక్రెయిన్ జాఫ్రోరిస్టా విశ్వవిద్యాలయంలో పామూరుకు చెందిన గద్దె వెంకటసాయి ఆర్య ఎంబీబీఎస్ అయిదో సంవత్సరం చదువుతున్నాడు. అతను ఉంటున్న ప్లాట్ వెనుక ఆర్మీ క్యాంపు బెటాలియన్ ఉండడంతో శుక్రవారం ఖాళీ చేసి స్నేహితుడి ఇంటికి వెళ్లినట్లు తెలిపారు.. యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నవారిని తొలుత స్వదేశాలకు పంపుతున్నారన్నారు. తమ కుమారుడితో రాత్రి 7 గంటలకు చరవాణిలో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నట్లు తల్లిదండ్రులు రవీంద్రబాబు, స్వప్న తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి త్వరితగతిన మన దేశానికి రప్పించాలని కోరారు.
నిత్యావసరాలు దొరకడంలేదు
పొనుగుపాటినగర్‌కు చెందిన పుట్టా జశ్వంత్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడినుంచి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ‘యుద్ధంతో కర్ఫ్యూ విధించారు. నిత్యావసరాలు దొరకడంలేదు. బంకర్‌లో మైనస్ 4 డిగ్రీల చలి. దుప్పట్లు తెచ్చుకోలేదు. బాంబుల మోతతో భయాందోళనకు గురవుతున్నాం. పోలెండ్ మీదుగా భారత్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. సరిహద్దు దాటడంపై ఆందోళనకరంగా ఉంది.’ అని తెలిపారు.
టికెట్ కొనుగోలు చేసినా..
అద్దంకిలోని కాకానిపాలెంకు చెందిన బెల్లంకొండ చిరంజీవి 2018లో ఆ దేశానికి వెళ్లారు. పెట్రోమొహిలబ్లాక్ సీ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతూ మైకోలైవి పట్టణంలో ఉంటున్నారు. యుద్ధం వస్తుందని గుర్తించిన చిరంజీవి భారతదేశానికి రావడానికి టికెట్ కొనుగోలు చేశాడు. ఈలోపు రవాణా ఆగిపోవడంతో అక్కడే ఉన్నాడు. నిరంతరం రాజమండ్రిలోని బాబాయి బ్రహ్మాజీతో మాట్లాడుతున్నాడు. అద్దంకిలోని కుటుంబసభ్యులు చిరంజీవి కోసం ఎదురుచూస్తున్నారు.
ఆ ప్రాంతంలోనే బాంబు పడింది
ఉక్రెయిన్‌లోని ఒడిసాలో మార్కాపురం మండలం గొట్టిపడియకు చెందిన తుమ్మ సుబ్బారెడ్డి, లక్ష్మీనారాయణమ్మల కుమారుడు వెంకట శివారెడ్డి ఉంటున్నారు. 2016లో వెళ్లిన ఆయన నేషనల్ మెడికల్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ‘ఈ నెల 24న నేను ఉంటున్న ప్రాంతానికి దూరంగా బాంబు దాడి జరిగింది .బయట ఎంతమంది చనిపోయారో తెలియదు. ఉదయం తోటి స్నేహితులతో గదిలో ఉంటున్నా.. రాత్రికి బంకర్‌లో తలదాచుకుంటున్నానన్నారు. ఆహారం పూర్తిస్థాయిలో లభించడం లేదు’ అని తెలిపారు.
త్వరగా తీసుకువెళ్లాలి...
రాజుబంగారుపాలేనికి చెందిన కల్లూరి జయప్రతాప్ ఉక్రెయిన్‌లోని స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తాము ఉంటున్న ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉన్నా... అంతా భయంగానే గడుపుతున్నట్లు చెప్పారు. ఇక్కడి విద్యార్థులను 775 కి.మీ. దూరాన ఉన్న హంగేరీకి శుక్రవారం రాత్రి బస్సుల్లో తీసుకువెళ్లనున్నట్లు చెప్పారన్నారు. మరో ప్రాంతంలో ఉన్న కొందరు విద్యార్థులను 11 బస్సుల్లో సరిహద్దు దాటించారన్నారు.
ఇండియాకు రప్పించాలి
సీఎస్ పురానికి చెందిన విద్యుత్తు శాఖ బిల్ కలెక్టర్ ఎర్రగుడ్డి నాగేశ్వరరావు, రాజమణిల కుమార్తె రీనా తేజోన్మయి ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. విన్నిట్సియాలోని కళాశాల హాస్టల్‌లోనే ఉంటున్న ఆమెతో శుక్రవారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. హెచ్చరికలు వచ్చినప్పుడు బంకర్లలో తలదాచుకుంటున్నామని, ఆహారం కూడా పూర్తిస్థాయిలో అందడంలేదని రీనా తెలిపిందన్నారు. రెండుసార్లు విమాన టికెట్లు తీసుకున్నా అక్కడి అధికారులు రద్దు చేశారన్నారు. భారతీయ విద్యార్థులను తక్షణం ఇక్కడకు తీసుకురావాలన్నారు.
క్షేమంగానే ఉన్నానంటూ..
యర్రగొండపాలెం మండలం గంగుపల్లెకు చెందిన నంబూరు మహానంద్ ఉక్రెయిన్ దేశంలోని యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అయిదేళ్ల క్రితం అక్కడకు వెళ్లాడు. శుక్రవారం ‘న్యూస్‌టుడే’ ఫోన్‌లో సంప్రదించగా ప్రస్తుతం బాగానే ఉన్నానని.. తాను ఉన్న ప్రదేశం నుంచి 220 కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరుగుతోందన్నాడు. భారత ప్రభుత్వం రుమేనియా, హంగేరి ప్రాంతాలకు ప్రత్యేక విమానాలు పంపే ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు.
బయటకు రావద్దని చెప్పి
‘తొందరపడి బయటకు రావద్దని మా అబ్బాయికి చెప్పాం’ అంటూ అద్దంకి మండలం బొమ్మనంపాడుకు చెందిన నల్లమోతు పవన్‌కుమార్ తండ్రి వెంకయ్య తెలిపారు. నాలుగేళ్ల క్రితం కుమారుడు ఉక్రెయిన్ వెళ్లాడన్నారు. తాను ప్రస్తుతం ట్రాక్టర్ మెకానిక్‌నని, దర్శిలో ఉంటున్నానన్నారు. భయపడటం లేదని.. కుమారుడికి ధైర్యం చెబుతున్నామన్నారు.
పక్క దేశానికి పంపుతామంటున్నారు...
అద్దంకి మండలం పేరాయపాలెం సర్పంచి జాగర్లమూడి సత్యనారాయణ కుమారులు ప్రవీణ్, చందులు ఉక్రెయిన్ రాజధాని కీవ్స్‌కు 500 కి.మీ. దూరంలో ఉంటున్నారు. రోడ్డు మార్గంలో పొరుగు దేశానికి పంపి...అక్కడి నుంచి విమానంలో భారత్ పంపిస్తామని అధికారులు తెలిపారన్నారు.
విద్యార్థితో మాట్లాడిన ఎమ్మెల్యే
కొరిశపాడు మండలం మాలెంపాటివారిపాలేనికి చెందిన ఈశ్వర్ సాయి పవన్... జఫోర్జియాలో చదువుతున్నారు.అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి మాట్లాడారు. ఏ సాయం కావాలన్నా వెంటనే తెలియజేయాలని సూచించారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విజయవాడ విద్యార్థిని కార్తీక.....ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఎంబసీ అధికారులు వేగంగా స్పందించాలంటూ... కార్తీక బంధువులు కోరుతున్నారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకుని విలవిల
ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రస్తుతం ఆందోళనలో మునిగిపోయారు. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు నెలకొనడంతో విద్యార్థులంతా ఎక్కడెక్కడో తలదాచుకున్నారు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన శీలం రాధిక ఉక్రెయిన్‌లోని కార్కేవ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ మూడో ఏడాది చదువుతోంది. విజయవాడ రాజీవ్‌శర్మనగర్‌కు చెందిన కార్తీక ఉక్రెయిన్‌లోని విన్‌త్సియా జాతీయ వైద్య విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ రెండో ఏడాది చదువుతోంది. వీళ్లిద్దరూ ఉక్రెయిన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. తమ పరిస్థితిని వివరిస్తూ తల్లిదండ్రులకు వీడియో మోసేజ్‌లు శుక్రవారం పంపించారు. రాధిక ఓ మెట్రోస్టేషన్ బేస్‌మెంట్‌లో, కార్తీక ఓ బంకర్‌లో తలదాచుకుంటున్నట్టు వెల్లడించడంతో ఇక్కడ వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.