Job Calendar in AP: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయో తెలియక నిరుద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కొలువుల కోసం ఎన్నాళ్లు శిక్షణ పొందుతూ గడపాలని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకించి గ్రూప్-1, 2, పోలీసు ఉద్యోగాల భర్తీకి విడుదల చేసే ప్రకటనల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. జాబ్ క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం ఈ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు దాటి నెలలు గడిచిపోతున్నా..ఫలితం కనిపించకపోవడంతో లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జాబ్ క్యాలెండర్‌లో పేర్కొన్న 10,143 ఉద్యోగాల నియామకానికి 2022 మార్చి నాటికి ప్రకటనలు రావాల్సి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ కింద ద్వారా 6,143 పోస్టుల భర్తీ జరుగుతోంది. అలాగే బ్యాక్‌లాగ్ వేకెన్సీల (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు) కింద పేర్కొన్న 1,238 పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ, ఇతర శాఖల ద్వారా జరుగుతోంది. జాబ్ క్యాలెండరులో పేర్కొన్న ప్రకారం మరో 2,000 ఉద్యోగాల నియామక ప్రకటన వచ్చేందుకు ఈ నెలాఖరు వరకు, మరో 36 ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన వెలువడేందుకు వచ్చే నెలాఖరు వరకు సమయం ఉంది.
గ్రూపు-1, 2 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఆగస్టులో రావాల్సి ఉండగా...!
జాబ్ క్యాలెండర్‌లో గ్రూపు-1, 2 కింద 36 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రూపు-1 కింద 31, గ్రూపు-2 కింద 5 పోస్టులు మాత్రమే చూపించారని తెలిసింది. ఈ ఉద్యోగాల భర్తీకి గత ఆగస్టులోనే నోటిఫికేషన్ రావల్సి ఉంది. ఈ పోస్టులు మరీ తక్కువగా ఉండడంతో నిరుద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. అయినా ఇప్పటివరకూ ఈ సంఖ్య పెరగలేదు. పోలీసు, ఇతర ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు ఎంతకీ రాకపోతుండటంతో కొందరు నిరుద్యోగులు దరఖాస్తు చేసేందుకు వయోపరిమితి రీత్యా అర్హత కోల్పోతున్నారు. అన్ని కేటగిరీల్లో కలిపి భర్తీచేస్తామని పేర్కొన్న పోస్టుల సంఖ్యే చాలా తక్కువని.. వాటికి కూడా ముందుగా ప్రకటించిన ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వకపోవటం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. దీనివల్ల ఖాళీ అయ్యే పోస్టులు మరింత తగ్గినట్లు నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసు ఉద్యోగాలు ఎక్కడ
గతేడాది జూన్ 18న సీఎం విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం పోలీసు శాఖలో 450 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరులో నోటిఫికేషన్ రావాల్సి ఉండగా ఇప్పటికీ జారీ కాలేదు. రాష్ట్రంలో చివరిసారిగా 2018 డిసెంబరులో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. చివరిసారిగా ప్రకటన విడుదలైనప్పుడు దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడూ అదే స్థాయిలో ఆశావాహులు ఉన్నారు.