governments rules on foreign education aid scheme విదేశీ విద్య సాయానికి ప్రభుత్వం విధించిన నిబంధనలు విద్యార్థులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం ఎదురు చూడటమా... వీసా వచ్చినందున విదేశాలకు వెళ్లడమా... అనేది తేల్చుకోలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం మాత్రం విద్యార్థుల సమస్యలను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. సాధారణంగా రాష్ట్రం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాలలో చదువుకునేందుకు వెళ్తుంటారు. అక్కడి విశ్వవిద్యాలయాలు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో తరగతులు ప్రారంభిస్తాయి. రాష్ట్రంలో విద్యా సంవత్సరం మార్చి, ఏప్రిల్‌లో ముగుస్తున్నందున ముందు నుంచే విద్యార్థులు విదేశీ వర్సిటీలకు దరఖాస్తు చేస్తారు. అన్ని దేశాల్లోని విశ్వవిద్యాలయాలు జులై నుంచి అక్టోబరు వరకు తరగతులు ప్రారంభిస్తాయి. వీటికి ముందు నుంచే ప్రవేశాల దరఖాస్తులు, వీసాల ప్రక్రియ పూర్తవుతుంది.
ఇప్పటికే విదేశీ విద్యకు వీసాలు వచ్చిన వారు దాదాపు 90% మంది వెళ్లిపోయారు. ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా వింత షెడ్యూల్‌ను ప్రకటించింది. సెప్టెంబరు 30 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఆ తర్వాత పరిశీలన చేస్తామంది. దీనికి విద్యార్థులు స్వయంగా హాజరు కావాలనే నిబంధన విధించింది. ఇప్పటికే పలువురు విదేశాలకు వెళ్లిపోయారు. మరికొందరు సెప్టెంబరులో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం విధించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరు వరకు ఎదురుచూడాలా? వీసా వచ్చినందున వెళ్లాలా? అనే దానిపై పేద విద్యార్థులు ఎటూ తెల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి ఎలా వస్తారు? సెప్టెంబరులోనే తరగతులు ప్రారంభమయ్యే వారు అక్టోబరు వరకు నిరీక్షించడం కుదురుతుందా? అనేదాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.