కృష్ణా జిల్లా మోపిదేవి మండలం, నాగాయతిప్ప సరిహద్దులోని కృష్ణానదిలో గుడిసెలు వేసుకుని 8 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. చిన్నాపెద్దా కలిపి సుమారు 50 మంది ఉన్నారు. గత రెండు నెలలుగా కృష్ణానదిలో వరదలు రావడంతో నదిలో వేటాడే అవకాశం లేకపోవడమే కాదు.. ఉన్న గుడిసెలూ కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కరకట్టపైకి చేరుకున్నారు. వరద బాధితులకు పునరావాసం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా... వారికి ఎలాంటి సహాయం అందలేదు. ఫలితంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో యాచిస్తూ... ఆకలి తీర్చుకుంటున్నారు. వారి దీనస్థితిని చూసిన పలువురు రైతులు సాయం చేస్తున్నారు.
ధ్రువపత్రాలు ఉన్నా...
తరతరాలుగా కృష్ణానదిలో ఉండే ఈ నిరుపేద కుటుంబాలకు రేషన్, ఆధార్, ఓటర్ కార్డులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందటం లేదు. స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు సాయం చేసేందుకు ముందుకు వస్తే తప్ప ఆకలి తీరని పరిస్థితి. ఏవరైనా సాయం చేసినా ఒక్క పూటకే సరిపడుతుంది. కేజీ బియ్యం వస్తే తలో ముద్ద మాత్రమే తిని ఆకలి తీర్చుకుంటున్నారు.