భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలైన మహాభారతం, రామాయణాలు.. సమాజ వికాసానికి కావాల్సిన ఎన్నో అంశాల్ని తెలియ జేస్తుంటాయి. అన్నదమ్ములు, తండ్రీ-కొడుకులు, భార్యా-భర్తల అనుబంధాలు ఎలా ఉండాలో తెలియజేస్తూ.. ఎన్నో విలువల్ని బోధిస్తుంటాయి. నీతి, నిజాయతీ వంటి ధర్మాల్ని తెలియ జేయడంలో ముందు నిలుస్తాయి. అందుకే.. చిన్న వయసులోనే పిల్లలకు ఈ గ్రంథాల్ని పరిచయం చేయాలి అంటున్నాడు.. శ్రీరామ చక్రధర్.
ఆత్మసంతృప్తి కోసం..
కడప జిల్లా ప్రొద్దుటూర్‌కు చెందిన ఈ యువకుడు... ప్రముఖ బిట్స్ పిలానీ యూనివర్శిటిలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం... ఒరాకిల్, బ్రావో లూసి వంటి దిగ్గజ కార్పోరేట్ సంస్థల్లో ఐటీ ఉద్యోగిగా పని చేశాడు. చేతి నిండా పని, చదువుక తగ్గ కొలువు... అయినా ఏదో అసంతృప్తి. ఆ అన్వేషణలోనే ఆర్జన కన్నా.. ఆత్మసంతృప్తి ముఖ్యమనుకుని... ఉపాధ్యాయ వృత్తి చేపట్టాడు.
విలువలు చేరవేయాలని..
చిన్నారులతో మమేకం అవుతున్న కొద్దీ... వారికోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నాడు... చక్రధర్. అదే విషయాన్నిచిన జీయర్ స్వామీ వారి దగ్గర ప్రస్తావించగా... ఆయన సూచనల మేరకు పిల్లలకు అర్థమయ్యేలా రామాయణం, మహాభారతాల్ని అందించాలి అనుకున్నాడు. ఈ గ్రంథాల్లోని విలువల్ని చిన్నారులకు చేరువ చేసేందుకు సంకల్పించారు.
8 ఏళ్ల తపన..
దాదాపు 8 ఏళ్లు మూల గ్రంథాాలపై రీసెర్చ్ చేసిన చక్రధర్.... తను నేర్చుకున్న అంశాల్ని తోటి రచయిత్రి శారదా దీప్తి సహకారంతో తవాస్మి రామాయణంగా మలిచాడు. ఈమె... చక్రధర్‌తో కలిసి బిట్స్ పిలానీలోనే చదువుకునే రోజుల్లో స్నేహితులు. శారదా కూడా 5 ఏళ్లు ఉద్యోగం చేసి... ఆధ్యాత్మిక మార్గం పట్టింది. అలా... వీరిద్దరూ కలిసి తవాస్మి రామాయణం రచన సాగించారు. చిన్నారులకు, పెద్దలకు సులువుగా అర్థం అయ్యేలా రాసిన ఈ పుస్తకం... ఆధ్యాత్మిక అనుభూతిని పంచడంతో పాటు ఆచరణ యోగ్యమైన కార్యచరణకు సిద్ధం చేస్తుందని చెబుతున్నారు.