ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Irrigation projects: అప్పులు రాక.. పనులు సాగక.. - హైదరాబాద్ తాజా వార్తలు

Irrigation projects: ఆర్థిక సంస్థల నుంచి రుణాలు ఆగిపోవడంతో సాగునీటి ప్రాజెక్ట్​లపై తీవ్ర ప్రభావం పడింది. తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచీ ప్రభుత్వం నామ మాత్రంగానే డబ్బులు చెల్లిస్తుంది. ఇతర ఆర్థిక సంస్థల నుంచి భారీగా రుణాలు అందినా.. గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. దీంతో పనులు, బిల్లుల చెల్లింపులు, భూసేకరణ, పునరావాసంనకు ఇబ్బందికరంగా మారింది.

అప్పులు రాక.. పనులు సాగక..
అప్పులు రాక.. పనులు సాగక..

By

Published : Jul 11, 2022, 9:29 AM IST

Irrigation projects: ఆర్థిక సంస్థలు రుణాలను నిలిపివేయడం, తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఆ ప్రభావం సాగునీటి ప్రాజెక్టుల పనులపై పడింది. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులతో పాటు పాలమూరు - రంగారెడ్డి, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల, వరదకాలువ, తుపాకులగూడెం, సీతమ్మసాగర్‌ బ్యారేజి ప్రాజెక్టుల పనులకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకొంది. నాలుగేళ్లుగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి భారీగా రుణాలు అందినా, గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. దీంతో పనులు, బిల్లుల చెల్లింపులు, భూసేకరణ, పునరావాసం..ఇలా అన్నింటికీ ఇబ్బందికరంగా మారింది.

నెలకు వెచ్చిస్తోంది రూ.350 కోట్లే:2022-23వ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానా నుంచి రూ.9,197 కోట్లతో పాటు రుణాలతో కలిపి సుమారు రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా సరాసరిన నెలకు రూ.రెండువేల కోట్లకు పైగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై వెచ్చించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఏప్రిల్‌ ఒకటి నుంచి జూన్‌ ఆఖరు వరకు మూడునెలల్లో చెల్లించింది రూ.1,050 కోట్లు మాత్రమే.

వీటిలో రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చినవి రూ.563 కోట్లు కాగా, బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకున్నవి రూ.487 కోట్లు. అంటే సగటున వెచ్చించింది నెలకు రూ.350 కోట్లు మాత్రమే. గత కొన్నేళ్లుగా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. రూరల్‌ ఎలక్ట్రికల్‌ కార్పొరేషన్‌ (ఆర్‌.ఇ.సి), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పి.ఎఫ్‌.సి)లు ఒప్పందం చేసుకొన్న మేరకు రుణాలు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఒప్పందాలను ఉల్లంఘించి రుణాలు విడుదల చేయని సంస్థలపై న్యాయపోరాటాన్ని చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.

అత్యధికం కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల్లోనే:కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మొదట కుదుర్చుకొన్న ఒప్పందం మేరకు వివిధ బ్యాంకులతో కూడిన కన్సార్షియం ద్వారా రుణాలు విడుదలయ్యాయి. సుమారు రూ.58 వేల కోట్ల అప్పు తీసుకొన్నారు. తిరిగి చెల్లింపు కూడా ప్రారంభమైంది. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనికి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు ఆర్‌.ఇ.సి, పి.ఎఫ్‌.సి సంస్థలు సుమారు రూ.30 వేల కోట్ల మేరకు రుణాలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. పాలమూరు-రంగారెడ్డికి సుమారు రూ.ఆరువేల కోట్లకు పైగా అప్పు ఇచ్చాయి.

దీంతో పాటు కాళేశ్వరం అదనపు టీఎంసీ పనికి కూడా అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి నిధులు ఆగిపోయాయి. ఈ రెండు సంస్థల నుంచే ఒప్పందం చేసుకొన్న మొత్తంలో సుమారు రూ.20 వేల కోట్లకు పైగా రావలసి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేవాదుల, సీతారామ ఎత్తిపోతల, శ్రీరామసాగర్‌ వరద కాలువ, తుపాకులగూడెం, సీతమ్మసాగర్‌ బ్యారేజీలకు ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకొన్నారు.

ఇందులో సీతమ్మసాగర్‌కు పి.ఎఫ్‌.సి నుంచి కాగా, సీతారామ ఎత్తిపోతల ఎలక్ట్రో మెకానికల్‌ పనులకు ఆర్‌.ఇ.సి నుంచి రుణం తీసుకొన్నారు. సీతారామ ఎత్తిపోతలకు రూ.ఎనిమిదివేల కోట్ల రుణానికి ఒప్పందం జరిగింది. ఇందులో రూ.2,500 కోట్ల దాకా ఇంకా విడుదల కావల్సి ఉంది. సీతమ్మసాగర్‌కు రూ.3,400 కోట్లకు గాను రూ.మూడువేల కోట్ల వరకు విడుదల కావల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా అయిదు ప్రాజెక్టులకు కలిపి రూ.20,500 కోట్ల రుణానికి ఒప్పందం జరగ్గా, రూ.ఆరువేల కోట్లకు పైగా ఇంకా విడుదల చేయాల్సి ఉంది. బ్యాంకుల నుంచి ఒప్పందం మేరకు విడుదల చేసే అవకాశం ఉన్నా, మార్జిన్‌ మనీకి అవసరమైన నిధులను ఆర్థిక శాఖ విడుదల చేయకపోవడం సమస్యగా మారింది. కాళేశ్వరంలో రూ.1,820 కోట్లు, సీతారామ ఎత్తిపోతలలో రూ.740 కోట్లు మార్జిన్‌మనీ కింద విడుదల కావల్సి ఉన్నట్లు తెలిసింది. ఈ కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 18 ప్రాజెక్టులలో అసలు చెల్లింపులు లేకపోగా, తొమ్మిది ప్రాజెక్టుల్లో రూ.పదికోట్ల లోపే ఉంది. కొన్నింటిలో నామమాత్రంగా ఉంది.

ఎందుకీ పరిస్థితి:కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో కొన్ని ప్రాజెక్టులను అనుమతి లేనివిగా పేర్కొనడం, బడ్జెటేతర రుణాలను కూడా ఎఫ్‌.ఆర్‌.బి.ఎం.పరిధిలోకి తేవాలని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆర్థిక సంస్థలు రుణాలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే రుణాలకు ఒప్పందాలు చేసుకొని పనులు ప్రారంభించిన తర్వాత ఆపేస్తే ఆ ప్రభావం పనులపై పడుతుందని, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్ల గుత్తేదారులు క్లెయింలు కోరే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఒప్పందం ప్రకారం రుణాలు విడుదల చేయకపోవడమే ఇలాంటి సమస్యలన్నింటికీ కారణం కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details