తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లోని అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఈ కార్యక్రమాలు జరిగినట్లు పార్టీ పేర్కొంది. బీసీ నాయకత్వాన్ని అణిచేసేందుకు వైకాపా చేసే కుట్రలను బీసీలంతా ఏకమై తిప్పికొట్టాలని నేతలు పిలుపునిచ్చారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసాన్ని ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యమత ప్రచారం, బలవంతపు మత మార్పిళ్లను ప్రశ్నించడమే నేరమా.. అని నినాదాలు చేశారు.
గుంటూరు జిల్లాలో...
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజా అన్నారు. తెనాలిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. వైకాపా నేతలు అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయారని విమర్శించారు. పేదవాడి పొట్టలు కొట్టి.. డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఆలపాటి రాజా ఆరోపించారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు రాత్రివేళ పిలుస్తారా.. అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని కాపాడటంలో అధికార ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అడుగడుగునా తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీలపైనే.. ఎస్సీ యాక్ట్ పెట్టే స్థితిలో ప్రభుత్వం దిగజారిందని ఆలపాటి విమర్శలు గుప్పించారు.
తూర్పుగోదావరి జిల్లాలో...