అనంతపురం జిల్లాలో...
అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి.. రూ.50 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలని కళ్యాణదుర్గంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. కరోనా నివారణలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని కోరారు. ప్రాణాలను లెక్క చేయకుండా విధుల్లో పాల్గొని మృతిచెందిన వారికి కదిరిలో నివాళులు అర్పించారు. కరోనా వ్యాప్తి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలని కోరారు. వైరస్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లాలో...
కరోనా యోధులకు మద్దతుగా ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు. కరోనా నివారణలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లాలో...
కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రెండు లక్షలు రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని.. చీరాలలో తెదేపా నేతలు ఆందోళన చేశారు. వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. మార్టూరు మండలంలో తెదేపా శ్రేణులు నిరసన దీక్షను చేపట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపుతో ఈ ఆందోళనలు చేస్తున్నామని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
కరోనా నియంత్రణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దీక్ష చేశారు. ప్రభుత్వానికి మద్యంపై ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ప్రతి పేద కుటుంబానికి రూ.10 వేలు ఆర్ధికసహాయం అందిచాలని డిమాండ్ చేశారు. వైరస్‌తో మృతి చెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు రూ.50 లక్షలు చెల్లించాలన్నారు.
గుంటూరు జిల్లాలో...