ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 21, 2021, 8:32 PM IST

Updated : Apr 21, 2021, 8:38 PM IST

ETV Bharat / city

ఊరూరా రామనామస్మరణ.. వాడవాడలా కల్యాణ వైభోగం

జగదాబిరాముడు, సకలగుణదాముడైన జానకిరాముని కల్యాణోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కన్నుల పండువగా జరిగాయి. శ్రీరాముడి జన్మదినమైన ఛైత్రశుద్ధ నవమిని భక్తిశ్రద్ధలతో వేడుకగా జరుపుకున్నారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూనే పూజారులు, ఆలయ అధికారులు సీతారామ క‌ల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

sriramanavami celebrations in state, ap sriramanavami
రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలు, ఏపీలో సీతారాముల కల్యాణం

రామనామస్మరణతో మారుమోగిన రాష్ట్రం

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాములోరి ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. కృష్ణా, రాయలసీమ జిల్లాల్లో శ్రీరాముని కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఆలయాలు.. శ్రీరామ నామస్మరణతో మారుమోగాయి.

కడప జిల్లాలో...

ఒంటిమిట్టలో కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఉత్సవమూర్తుల్ని ప్రత్యేకంగా అలంకరించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం జరిపారు.

రాయచోటి నియోజకవర్గంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక ఎన్జీవో కాలనీలోని శ్రీ కోదండ రామాలయం, కొత్తపేట శ్రీ పట్టాభి రామాలయం, శివ రామాలయాలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పూజలు చేశారు.

విజయనగరంలో...

రామతీర్థంలో శ్రీరామ నవమి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున సింహాచలం దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను.. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు స్వామివారికి సమర్పించారు. స్థానిక ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సీతారామ‌ల‌క్ష‌ణ వాహ‌నాల త‌యారీ కోసం బొత్స కుటుంబ సభ్యుల తరఫున మంత్రి స‌త్య‌నారాయ‌ణ దంప‌తులు రూ.14.50 ల‌క్ష‌ల‌ భారీ విరాళాన్ని అంద‌జేశారు. రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవస్థానాల ఈవోలు ఇందులో పాలుపంచుకున్నారు.

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని.. కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లోని చారిత్రక ప్రధానమైన రామాలయాల్లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

కృష్ణాలో...

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ సీతారామ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. బీసెంట్‌ రోడ్డులో ఏటా అట్టహాసంగా నిర్వహించే కల్యాణం.. ఈసారి కరోనా నిబంధనల మేరకు పరిమితంగా చేశారు. చాలా ఆలయాల్లో పానకం, వడపప్పు పంపిణీ చేయకుండా.. కేవలం తలంబ్రాలు అందించారు. నందిగామలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ ఆవరణలోని మండపంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.

మోటూరులో వైభవోపేతంగా సీతారామ కల్యాణ వేడుకలు నిర్వహించారు. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తులు, తాతాచార్యుల వారి కుమారులు రఘునాథ ఆచార్యులు, వెంకటాచార్యులు ఆధ్వర్యంలో.. శ్రీ చలంచర్ల మురళీ కృష్ణమాచార్యులవారు శాస్త్రయుక్తంగా కల్యాణం జరిపించారు. మైలవరంలోని కోదండరామ దేవాలయంలో సీతారామ కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. కల్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులకు పానకం, వడపప్పుతో పాటు మాస్కులు, శానిటైజర్లు​ అందజేశారు. మోపిదేవి మండలం కోసురువారిపాలెంలోని శ్రీకోదండరామాలయంలో కొద్దిమంది భక్తుల సమక్షంలో సీతారాముల కల్యాణం జరిగింది. ప్రసాదం, తీర్థం లేకుండా అర్చకులు కేవలం తలంబ్రాలతో భక్తులను ఆశీర్వదించారు.

తూర్పుగోదావరిలో...

అన్నవరం దేవస్థానంలో రాములోరి కల్యాణం నిరాడంబరంగా జరిగింది. భక్తులు లేకుండానే రామాలయం లోపలే వైదిక బృందం ఆధ్వర్యంలో కల్యాణం జరిపించారు. ఆలయ ఛైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్తిపాడులో శ్రీరామనవమి కల్యాణోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఒమ్మంగిలో సుంకరవారి రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిపారు. శంఖవరం, రౌతులపూడి, ఏలేశ్వరం మండలాల్లో రామాలయాలు భక్తులతో కోలాహలంగా కనిపించాయి.

అమలాపురం పట్టణంతో సహా కోనసీమవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పి.గన్నవరంలోని శ్రీ పట్టాభి సీతారామ ఆలయంలో స్వామి, అమ్మవార్లకు పేరిచర్ల భీమరాజు, సత్యవాణి దంపతులు 120 రకాల పిండి వంటలు, ఇతర పదార్థాలతో సమర్పించిన విందు.. భక్తులకు కనువిందు చేసింది.

కేంద్రపాలిత యానాం సహా ముమ్మడివరంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఏటా ఘనంగా జరుపుతుండగా.. కరోనా దృష్ట్యా అతి తక్కువ మంది భక్తుల సమక్షంలో వేడుకలు చేశారు. తాళ్లరేవు మండలం జార్జిపేటలో.. వేద పండితులు సీతారామ కల్యాణం విశిష్టతను వివరించారు. ఈ ఉత్సవం తిలకించేందుకు వచ్చిన భక్తులకు పానకం, వడపప్పు ప్రసాదంగా ఇచ్చారు.

పశ్చిమగోదావరిలో...

తణుకులో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితులు శాస్త్రానుసారం పరిణయ క్రతువు నిర్వహించారు. వడ్లూరి సీతారామ కృష్ణ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

చిత్తూరులో...

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని.. శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో.. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల మధ్య అభిషేకం చేశారు. ఈ సమయంలో వేదపండితులు తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు పఠించారు. రాత్రి తిరువీధుల్లో హ‌నుమంత వాహ‌నసేవ నిర్వహించారు.

శ్రీకాళహస్తిలోని శ్రీ పట్టాభి రామాలయంలో.. సీతారాముల పరిణయ క్రతువును శాస్త్రోక్తంగా జరిపారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య హోమ పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం వేద పండితులు కల్యాణం నిర్వహించారు.

కర్నూలులో..

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో.. మూలరామ దేవునికి మహాభిషేకం నిర్వహించారు. పీఠాధిపతి సుబుదేంద్ర స్వామి ఆధ్వర్యంలో సంస్థాన పూజలు నిర్వహించారు. బంగారు మండపంలో స్వామి ప్రతిమలను కొలువు దీర్చి.. మహా అభిషేకం నిర్వహించారు. నంద్యాల సంజీవనగర్​లో​ వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో నవమి వేడుకలు నిర్వహించారు. మాంగళ్యధారణ, తలంబ్రాలు పోత ఘట్టాలు భక్తులకు కనువిందు చేశాయి. శ్రీరామ నవమి సందర్భంగా మహానంది ఆలయంలో సీతారామస్వామి కల్యాణం ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా నిర్వహించారు.

కోడుమూరు పట్టణం, గూడూరు నగర పంచాయతీలోని రామాలయం, వాల్మీకి ఆలయాలతో పాటు చనుగొండ్ల, గుడిపాడు గ్రామాల్లోనూ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో భక్తులకు అన్నదానం నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా పాల్గొని ఉట్టి కొట్టి వేడుకలు జరుపుకున్నారు. ఎమ్మిగనూరులోని సీతారామంజనేయస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. పండితులు కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ప్రకాశంలో...

చీరాల మండలం ఈపురూపాలెంలోని సీతారామ, ఆంజనేయస్వామివారి విగ్రహాలకు మేళతాళాలతో నగరోత్సవం నిర్వహించారు. వేద మంత్రాల నడుమ కల్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా .. యర్రగొండపాలెంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ పట్టాభి సీతారామస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అద్భుతంగా జరిపారు.

అనంతపురంలో...

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా చేశారు. యజుర్వేద మందిరం నుంచి సీతారామ ఉత్సవ మూర్తులను సాయి కుల్వంత్ సభామందిరంలోకి సత్యసాయి ట్రస్టు ఊరేగింపుగా తెచ్చి.. ఆయన మహా సమాధి చెంత ఉంచి కల్యాణం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ సీతారామ కల్యాణం వైభవంగా జరిగింది.

విశాఖలో...

సింహాచలంలోని శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. విశ్వక్షేణ ఆరాధన, పుణ్యహవచనం నిర్వహించారు. బ్రహ్మ ముహూర్త వేళ మాంగళ్య ధారణ గావించారు. అనంతరం ముత్యాలు కలగలిపిన తలంబ్రాల పోత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

చోడవరం మండలం అంభేరుపురంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దంపతులు సీతారాముల కల్యాణం జ‌రిపించారు. ప్రజలందరూ శుభిక్షంగా ఉండాలని అభిలాషించారు. గోవాడలో సర్పంచి, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడువాక వెంకట సత్యారావు దంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

భద్రాద్రిలో కనుల పండువగా సీతారాముల కల్యాణం

Last Updated : Apr 21, 2021, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details