రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు పక్రియ ముగిసింది. చివరి రోజు కావటంతో అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి భారీగా తరలివచ్చారు.
అనంతపురం జిల్లాలో
అనంతపురం జిల్లా రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నామినేషన్ల కార్యక్రమం జోరుగా సాగింది. నామినేషన్ల ప్రక్రియకు చివరి రోజు కావటంతో అభ్యర్థులు, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. సర్పంచి, వార్డు స్థానాలకు నామినేషన్లు వేయడానికి కేంద్రాల వద్ద బారులు తీరారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు పరిశీలించారు.
కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లా పామర్రు, పెదపారుపూడి మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ చివరి రోజు కోలాహలంగా జరిగింది. పామర్రులో వైకాపా బలపర్చిన సర్పంచి అభ్యర్థితో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ నామినేషన్ వేయించారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు తుది రోజు కావడంతో నామినేషన్ కేంద్రాలు అభ్యర్థులతో కిటకిటలాడాయి. పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు అభ్యర్థులు తరలివచ్చారు.