ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''విలీనం వద్దు.. ఆంధ్రాబ్యాంకును కొనసాగించాలి'' - కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడంపై.. వామపక్షాలు రాష్ట్రవ్యాప్త నిరసన చేపట్టాయి. కేంద్ర నిర్ణయాన్ని తప్పుబట్టాయి.

state wide protests

By

Published : Sep 4, 2019, 2:29 AM IST

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేశారు. నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఆంధ్ర బ్యాంక్ ఎదుట సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. బ్యాంకుల విలీన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు కేంద్రాన్ని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆంధ్రాబ్యాంకు ప్రధాన శాఖ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కేంద్రం నిర్ణయం అన్యాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఇదే జిల్లాలోని అద్దంకిలోని ఆంధ్రాబ్యాంకు వద్ద సీపీఐ, సీపీఎం, సీఐటీయూ కార్యకర్తలు నిరసన చేపట్టారు. గుంటూరు నగరంలో లాడ్జ్ సెంటర్ నుంచి కొరిటిపాడు ఆంధ్రాబ్యాంక్ కూడలి వరకు సీపీఐ, సీపీఎం నేతలు ర్యాలీ చేపట్టారు.

''విలీనం వద్దు.. ఆంధ్రాబ్యాంకును కొనసాగించాలి''

కడప జిల్లా రైల్వే కోడూరులోని ఆంధ్రాబ్యాంకు వద్ద జనసేన, సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. అనంతపురం కోర్టు రోడ్డులోని ఆంధ్రా బ్యాంకు వద్ద సీపీఎం, సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వామపక్ష నేతలతో కలిసి బ్యాంకు ఉద్యోగులు నిరసన చేపట్టారు. బ్యాంకు విలీనాన్ని వ్యతిరేకించారు. అదే జిల్లాలోని కొమరాడ ఆంధ్ర బ్యాంక్ ఎదుట సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఆంధ్ర బ్యాంకు ప్రధాన బ్రాంచ్ వద్ద సీపీఐ నాయకులు కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆంధ్రాబ్యాంకును యూనియన్‌ బ్యాంకులో విలీనానికి వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సీపీఐ నేతలు ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లా మదనపల్లె సీటీఎం రోడ్డులో ఉన్న ఆంధ్రాబ్యాంక్ ఎదురుగా సీపీఐ, సీపీఎం సంయుక్త ఆధ్వర్యంలో నిరసన చేశారు.

ABOUT THE AUTHOR

...view details