రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా వంటావార్పు కార్యక్రమం నిర్వహించింది. అన్న క్యాంటీన్ల మూసివేతను నిరసిస్తూ తెదేపా శ్రేణులు ఈ నిరసను దిగాయి. విజయవాడ రాణిగారితోటలోని అన్న క్యాంటీన్ వద్ద గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. అల్పాహారం, భోజనం అందిస్తున్న క్యాంటీన్లను మూసివేయడం అన్యాయమని నాయకులు మండిపడ్డారు.సెంట్రల్ నియోజకవర్గంలో మూసివేసిన అన్న క్యాంటీన్ల వద్ద మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరావు ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్ల వద్ద ధర్నాలు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు.
విజయనగరం జిల్లా సాలూరులో ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించారు. వైకాపా తొమ్మిది నెలల పాలనలో అభివృద్ధి శూన్యమని తెదేపా శ్రేణులు దుయ్యబట్టాయి.
విశాఖలోనూ మూతబడిన అన్న క్యాంటీన్ల వద్ద వంటావార్పు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదవాడి కడుపు మీద కొట్టిందని ఎమ్మెల్యే వెలగపూడి ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా మదనపల్లెలో అన్న క్యాంటీన్ వద్ద వంటచేసి పేద ప్రజలకు వడ్డించారు. వైకాపా పేదవాడి కడుపుపై కొట్టిందని తేదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలోను అన్నక్యాంటీన్ల వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా నాయకులు నినదించారు. క్యాంటీన్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వంటావార్పు ఏర్పాటు చేశారు.