తాడేపల్లిలోని వైకాపా కేంద్రకార్యాలయంలో ఆ పార్టీ పదో ఆవిర్భావ వేడుక జరిగింది. వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. చీరలు పంపిణీ చేశారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకున్న ఘనత జగన్‌దేనని కొనియాడారు.
శ్రీకాకుళం వైకాపా కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొని...కలసికట్టుగా పనిచేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. కాశీబుగ్గలో మంత్రి అప్పలరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఏలూరులో మంత్రి ఆళ్లనాని వైకాపా జెండాను ఆవిష్కరించారు. తాడికొండ , రంపచోడవరం, మాడుగుల, పి.గన్నవరంలోనూ వేడుకలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన.. వైకాపాలో వర్గ విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సమక్షంలో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి.
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వైకాపా బలోపేతానికి కృషి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలోని తన నివాసంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలసి పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతపురంలో మంత్రి శంకర్ నారాయణ, రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు.