ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పోలవరం పూర్తికి రాష్ట్ర పనితీరే కీలకం' - పోలవరం తాజా వార్తలు

ఆర్‌అండ్‌ఆర్‌పై ఎంత వేగంగా పని చేస్తే అంత త్వరగా పోలవరం పూర్తవుతుందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పష్టం చేశారు. తాజా టెండర్‌ ప్రకారం 2021 డిసెంబరు నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. కేంద్రం 2014 ఏప్రిల్‌ 1నాటి  ధరలనే భరిస్తుందని స్పష్టం చేశారు.

'పోలవరం పూర్తికి రాష్ట్ర పనితీరే కీలకం'
'పోలవరం పూర్తికి రాష్ట్ర పనితీరే కీలకం'

By

Published : Dec 3, 2019, 7:13 AM IST

"ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా పిలిచిన టెండర్‌ ఒప్పందాల్లో 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తిచేస్తామని చెప్పింది. ఈ ప్రాజెక్టులో పునర్నిర్మాణం, పునరావాసానికి (ఆర్‌అండ్‌ఆర్‌) సంబంధించిన చాలా అంశాలున్నాయి. ప్రాజెక్టు పూర్తయ్యే అంశం వాటన్నింటితో ముడిపడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యలను పరిష్కరించడానికి ఎంత వేగంగా పనిచేస్తుందన్న దాన్నిబట్టి... ప్రాజెక్టు ఎప్పటిలోపు అంతిమంగా అమల్లోకి వస్తుందన్నది ఆధారపడి ఉంటుంది’’ అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు. సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, జైరాం రమేష్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన ఈమేరకు సమాధానమిచ్చారు.

‘‘2017-18 ధరలకు అనుగుణంగా పోలవరం సవరించిన అంచనాలను రూ.55,548 కోట్లకు ఖరారు చేసినట్లు కేంద్రం చెబుతోంది. మరోవైపు 2014 ఏప్రిల్‌ 1నాటికున్న ధరల ప్రకారం సాగునీటి విభాగం వరకే భరిస్తామని అంటోంది. 2014 ఏప్రిల్‌ 1 నుంచి 2017-18నాటి ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆర్‌ అండ్‌ ఆర్‌, భూసేకరణతోసహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు భరిస్తారు’’ అని కేవీపీ ప్రశ్నించారు.

మంత్రి బదులిస్తూ ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం తర్వాత ఆర్థికశాఖ అప్పటి జలవనరులశాఖకు ఇచ్చిన నిర్దేశం ప్రకారం 2014 ఏప్రిల్‌ 1నాటికున్న ధరలను పోలవరం జాతీయ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. ‘‘తాజా అంచనాల నిర్ధారణ కోసం సవరించిన ధరల (రివైజ్డ్‌ కాస్ట్‌) కమిటీ ఏర్పాటు చేశాం. ఇప్పటివరకూ ఆ కమిటీ రెండు సార్లు సమావేశమై... రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత సమాచారం అడిగింది. అది ఇంకా రాలేదు. భూమి పరిమాణం, భూమి రకం, భూసేకరణ ధర మధ్య పెద్ద తేడా ఉంది. సహాయ, పునరావాస భూమి ధర వివరాలు అడిగాం. ఆ వివరాలు పూర్తిగా వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిశీలిస్తాం’’ అని పేర్కొన్నారు.

కేవీపీ మాట్లాడుతూ ‘‘ఏపీ విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం బాధ్యత. కానీ 2016 సెప్టెంబర్‌లో కేంద్రం ఈ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. సవరించిన అంచనాలు రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాది సమయం తీసుకొంది. దాన్ని ఆమోదించడానికి సీడబ్ల్యూసీ, సాంకేతిక సలహా కమిటీ 17 నెలలు తీసుకొన్నాయి. గత 9 నెలలుగా ఇప్పుడది కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. మూడేళ్లయినా సవరించిన అంచనాలను ఖరారు చేయలేకపోతే ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి? 2018లోనే పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్టు.. ఎప్పుడు పూర్తవుతుంది’’ అని ప్రశ్నించారు.

షెకావత్‌ బదులిస్తూ ‘‘ప్రాజెక్టు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. రెండు వారాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రివైజ్డ్‌ టెండర్‌ పిలిచింది. ఆ టెండర్‌ ఒప్పందంలో ప్రాజెక్టు పూర్తయ్యే తేదీగా 2021 డిసెంబర్‌ను పేర్కొన్నారు. అందువల్ల అప్పటికల్లా ప్రాజెక్టు పూర్తవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు చివరగా మాట్లాడుతూ ‘‘పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనరేఖ. దానికి సంబంధించి అన్ని పనులు పూర్తిచేయాలి’’ అని వ్యాఖ్యానించారు.

పోలవరంలో అదనపు చెల్లింపులు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రూ.2346.85 కోట్ల అదనపు చెల్లింపులు జరిగినట్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కేంద్ర జల సంఘానికి నివేదిక ఇచ్చిందని... కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా తెలిపారు. ఆ నివేదిక ప్రాథమికమైనదేనని, చెల్లింపులకు సంబంధించిన నిర్ణయాల్లో నిబంధనల ఉల్లంఘన జరగలేదని పేర్కొన్నారు. సోమవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఇదీ చదవండి

నేడు గవర్నర్​ను కలవనున్న తెదేపా నేతలు

ABOUT THE AUTHOR

...view details