హైదరాబాద్ బీఆర్కే భవన్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (State Level Bankers Meeting ) సమావేశం జరగ్గా.. తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao)తో పాటు బ్యాంకర్లు హాజరయ్యారు. 2021-22 ఏడాదికి లక్షా 86,035 కోట్ల 60 లక్షలతో వార్షిక రుణ ప్రణాళికకు ఆమోదం తెలిపారు. రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని ఆర్ధికమంత్రి కోరారు.
జాప్యం లేకుండా రుణాలు ఇస్తే రైతులు ఎరువులు, విత్తనాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తారని వివరించారు. వ్యవసాయానికి రూ.91,541 కోట్లు రుణాలుగా అందించనున్నట్లు బ్యాంకర్లు తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.39,361 కోట్లు, విద్య, గృహనిర్మాణం, వసతులు, పునరుత్పాదక ఇంధనానికి రూ.13,451 కోట్లుగా ఖరారు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్న హరీశ్‌రావు... వారం రోజుల్లోనే దాదాపు 61 లక్షల మంది పైగా రైతుల ఖాతాలలో 7,360 కోట్ల రూపాయలు జమచేశామన్నారు. రైతు బంధు ద్వారా ప్రభుత్వం అందించిన సాయాన్ని ఇతర రుణాలకు మళ్లించకుండా అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని... వాటి అమలుకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కోరారు.
చిన్న వ్యాపారులకు మరిన్ని ముద్రా రుణాలు అందించాలని కోరారు. ఆయిల్ పామ్, తృణధాన్యాలు తదితర పంటల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్న హరీశ్‌రావు... ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని తెలిపారు.
ఇదీ చూడండి:chandrababu: అమరావతిని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలనే కలను సాకారం చేశారు: చంద్రబాబు