ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఘనంగా బతుకమ్మ వేడుకల నిర్వహణపై తెలంగాణ దృష్టి.. ప్రత్యేకించి హైదరాబాద్​లో..!

Bathukamma Celebrations in Telangana 2022: తెలంగాణలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మహిళలు, ఉద్యోగుల భాగస్వామ్యంతో సంబురాలు వీధివీధినా జరిపేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్‌లో మరింత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు.

Bathukamma Celebrations in Telangana 2022
Bathukamma Celebrations in Telangana 2022

By

Published : Sep 23, 2022, 10:59 AM IST

ఘనంగా బతుకమ్మ వేడుకల నిర్వహణపై తెలంగాణ దృష్టి.. ప్రత్యేకించి హైదరాబాద్​లో..!

Bathukamma Celebrations in Telangana 2022: తెలంగాణలో బతుకమ్మ సంబరాలకు రంగం సిద్ధమయ్యింది. ఈ నెల 25 నుంచి అక్టోబరు 3 వరకు జరగనున్న వేడుకలను.. మరోసారి లోకానికి చాటి చెప్పేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో బతుకమ్మ పండుగ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

ఉద్యమ సమయంలో మహిళలు, ఉద్యోగులు, సకల జనులను ఏకీకృతం చేయడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషించడాన్ని గుర్తు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో మరోసారి గ్రామాలతో పాటు హైదరాబాద్‌లోనూ అత్యంత వైభవంగా నిర్వహించాలని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో లాల్ బహుదూర్ స్టేడియంలో సద్దుల బతుకమ్మ ముగింపు వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆదేశించారు.

వెయ్యి మందికిపైగా జానపద, గిరిజన కళాకారుల మధ్య వేలాదిమంది మహిళలు బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి ట్యాంక్‌బండ్​లో నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రవీంద్రభారతిలో వివిధ సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు జరపాలని పేర్కొన్నారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ సారథ్యంలో 26, 27, 28 తేదీల్లో "దేవీ వైభబ్" పేరిట శాస్త్రీయ నృత్యాలు ప్రదర్శిస్తారన్నారు. సాహిత్య అకాడమీ తరఫున మహిళా రచయితలు, కవులు బతుకమ్మ విశిష్టతను చాటిచెప్పేలా పుస్తకం ప్రచురించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు.

అధికార భాషా సంఘం సారథ్యంలో అక్టోబర్ 2న గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళిగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రధాన కార్యాలయం కావూరి హిల్స్‌లో పండగని దిగ్విజయంగా చేపట్టాలని నిర్ణయించారు. రవీంద్రభారతిలో ప్రతిరోజు బతుకమ్మ ఆడుకునేలా సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.

హైదరాబాద్‌లో కొన్ని ఎంపిక చేసిన జంక్షన్లతో పాటు టూరిజం హోటళ్లు, రైల్వే, బస్‌ స్టేషన్లు, విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాల్లోనూ బతుకమ్మ ప్రతిమలు నెలకొల్పనున్నారు. విద్యార్థులంతా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేలా యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపట్టాలని శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్లు పండుగ దిగ్విజయంగా జరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ నిర్వహణకు రాష్ట్రంలో ప్రతి జిల్లాకు తగినన్ని నిధులు ప్రభుత్వం అందిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా 10 కోట్లు విడుదల చేశారు. రాష్ట్రంతో పాటు దిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details