ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SIPB: రూ.9 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు.. 11 వేల మందికి ఉపాధి - 11 వేల మందికి ఉపాధి

రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (State Investment Promotion Board ) ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ (cm jagan).. కంపెనీల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. పరిశ్రమల వల్ల పర్యావరణంపై ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. నెల్లూరులో రూ.7,500 కోట్లతో జిందాల్‌ స్టీల్‌ పరిశ్రమ నెలకొల్పనున్నట్లు తెలిపారు.

cm jagan
state investment promotion board

By

Published : Jun 29, 2021, 8:55 PM IST

Updated : Jun 30, 2021, 5:06 AM IST

రాష్ట్రంలో సుమారు రూ.9వేల కోట్ల పెట్టుబడులతో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటిద్వారా 11 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని పేర్కొంది. సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రమోషన్‌ బోర్డు - ఎస్‌ఐపీబీ) సమావేశం మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. సీఎస్‌ అధ్యక్షతన ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ)లో చర్చించిన ప్రతిపాదనలపై తాజా సమావేశంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఇందులో జిందాల్‌ స్టీల్‌ ఆంధ్రా లిమిటెడ్‌ సంస్థ పెట్టే పెట్టుబడులే రూ.7,500 కోట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘పరిశ్రమల్లో స్థానికులకే 75% ఉద్యోగాలు ఇవ్వాలి. పరిశ్రమ ఏర్పాటుతో పర్యావరణంపై పడే ప్రభావాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పారిశ్రామిక ప్రగతిలో ముందడుగు వేయాలి’ అని అధికారులకు సూచించారు. ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి...

* నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం దగ్గర జిందాల్‌ స్టీల్‌ ఆంధ్రా లిమిటెడ్‌కు తక్కువ ధరకు 860 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంటులో సంస్థ రూ.7,500 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. దీనిద్వారా వచ్చే నాలుగేళ్లలో 2,500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. 22.5 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతిపాదనల్లో పేర్కొంది.

* నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణకు బోర్డు ఆమోదం తెలిపింది. దీనిద్వారా రూ.627 కోట్ల పెట్టుబడులను సంస్థ పెట్టనుంది. ఇప్పటికే తొలిదశలో రూ.750 కోట్ల పెట్టుబడులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అదనపు పెట్టుబడుల ద్వారా 2,200 మందికి ఉపాధి లభిస్తుంది. ఫోర్డ్‌, హ్యుందయ్‌, ఫోక్స్‌వాగన్‌ వంటి కంపెనీలకు అవసరమైన స్టీలు, ఇనుప ఉత్పత్తులను సంస్థ తయారుచేస్తోంది. జపాన్‌, దక్షిణ కొరియాలకు చెందిన అత్యాధునిక రోబోటిక్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తోంది.

* కడపలోని కొప్పర్తి దగ్గర రూ.486 కోట్ల పెట్టుబడులతో నీల్‌కమల్‌ లిమిటెడ్‌ సంస్థ ఫర్నిచర్‌, గృహోపకరణాల తయారీ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. దీనిద్వారా 2,030 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది.

* కొప్పర్తి దగ్గర రూ.401 కోట్ల పెట్టుబడులతో పిట్టి రెయిల్‌ ఇంజనీరింగ్‌ కాంపొనెంట్స్‌ లిమిటెడ్‌ ఎలక్ట్రికల్‌, లోకోమోటివ్‌, విద్యుత్‌ ఉపకరణాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ అనుమతించింది. దీనిద్వారా 2వేల మందికి ఉపాధి లభిస్తుంది.

* చిత్తూరు జిల్లా నిండ్ర మండలం ఎలకటూరులో అమ్మయప్పర్‌ టెక్స్‌టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. దీనిద్వారా రూ.30 కోట్ల పెట్టుబడులు.. 2,304 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. పురుషులు, పిల్లల దుస్తుల తయారీ పరిశ్రమ ద్వారా 90% ఉద్యోగాలను మహిళలకే కల్పించనుంది.

* విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో ప్రతిపాదించిన సెయింట్‌ గోబెన్‌ పరిశ్రమ ఏర్పాటుకు గడువును 2022 జూన్‌ వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ పరిస్థితుల కారణంగా పరిశ్రమ నిర్మాణ గడువు పెంచాలని కంపెనీ కోరింది. మూడు దశల్లో రూ.2001 కోట్ల పెట్టుబడులను సంస్థ పెట్టనుంది.

మరో రూ.14వేల కోట్ల పెట్టుబడులు: గౌతమ్‌రెడ్డి

రాష్ట్రానికి కొత్తగా మరో రూ.14వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐపీబీ సమావేశం అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర విలేకర్లతో మాట్లాడుతూ.. ‘సెమీ కండక్టర్‌ ల్యాబ్‌లు, పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల ఆకర్షణ కోసం మేం అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనినీ తెదేపా విమర్శిస్తోంది. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే.. వెళ్లిపోతున్నాయన్న ప్రచారం సరైంది కాదు. ఆయా సంస్థల అవసరాలు వేరు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కంపెనీలు కోరినవన్నీ మేం సమకూర్చలేకపోవచ్చు. చంద్రబాబు, ఇంకెవరికైనా దీక్షలు చేసుకునే హక్కు ఉంది. కానీ, ప్రతి విషయాన్నీ అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారు. టిడ్కో, కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలకు మించి 330 అడుగుల్లో ఇళ్లు నిర్మిస్తున్నాం. అయినా పేదల ఇళ్ల గురించి తెదేపా విమర్శిస్తోంది’ అని చెప్పారు.

తాడేపల్లిలో రిటైల్‌ బిజినెస్‌ పార్కు..

టెక్స్‌టైల్‌, గార్మెంట్స్‌ మార్కెటింగ్‌లో భాగంగా మెగా రిటైల్‌ పార్కు ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ ఆమోదించింది. దీని కోసం తాడేపల్లిలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీనిద్వారా రూ.194.16 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా. పార్క్‌లో భాగంగా 900 రిటైల్‌ యూనిట్ల ఏర్పాటు ద్వారా సుమారు 5 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి.. 20 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది. దేశ, అంతర్జాతీయంగా కొనుగోలు, విక్రయాలకు ఇది కేంద్రంగా మారుతుందని, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తుల్లో 70% విక్రయాలు ఇక్కడే జరుగుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ఏర్పాటయ్యే ఒక్కో స్టోరు ద్వారా ఏటా రూ.11 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. రిటైల్‌ పాలసీకి ఎస్‌ఐపీబీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

ఇదీ చదవండి:

OMC Case: 'జులై 5న వాదనలు వినిపించకపోతే తగిన ఉత్తర్వులు ఇస్తాం'

Last Updated : Jun 30, 2021, 5:06 AM IST

ABOUT THE AUTHOR

...view details