తెలంగాణలో భారీ ఎత్తున ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. వివిధ శాఖల్లో 80 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 52,460 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో గ్రూప్-1, పోలీసు ఉద్యోగాలు, వైద్య, ఆరోగ్య శాఖలోని ఉద్యోగాలు సహా ఇతరత్రా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేశారు.
ఆయా ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖల్లో నియామకాల ప్రక్రియ వేగంగా సాగుతోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా తేదీని కూడా పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ప్రభుత్వం అనుమతులు జారీ చేసినంత వేగంగా నోటిఫికేషన్లు విడుదల కావడం లేదన్న భావన ఉంది. ఉద్యోగాల నియామక పురోగతిపై ఇటీవల ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన సమీక్షలో ఈ విషయమై చర్చ జరిగింది.
అనుమతుల పరంగా ప్రక్రియ పూర్తైనప్పటికీ నోటిఫికేషన్ల జారీ ఆలస్యం ఎందుకని మంత్రి ప్రశ్నించారు. సంబంధిత అధికారులపై ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండి అనుమతులు ఇచ్చినప్పటికీ నోటిఫికేషన్లలో ఆలస్యం తగదని స్పష్టం చేశారు. వైద్య, ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. అనుమతులకు అనుగుణంగా చేయాల్సిన సవరణలు, మార్పులను పూర్తి చేసి నోటిఫికేషన్లు జారీ చేశారు.