ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

state-government-permission-granted-for-darshans-in-tirumala
తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

By

Published : Jun 2, 2020, 2:10 PM IST

Updated : Jun 2, 2020, 6:20 PM IST

14:09 June 02

ఈ నెల 8నుంచి తిరుమల శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ నెల 8నుంచి అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు భక్తులను అనుమతించాలంటూ మే 12న తితిదే రాసిన లేఖకు సానుకూలంగా స్పందించింది. దీంతో దాదాపు రెండున్నర నెలల తర్వాత భక్తులకు... ఆ దేవదేవుడి దర్శనభాగ్యం కలగనుంది.

తిరుమల సప్తగిరులలో గోవిందనామస్మరణలు తిరిగి వినిపించనున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపేసిన తితిదే.... తిరిగి రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ప్రవేశాన్ని పునరుద్ధరించింది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా జూన్‌ 8 నుంచి ఆలయాలు, ప్రార్థనామందిరాల్లోకి భక్తులకు... కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమలలో ఆ దేవదేవుడి దర్శనాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాలని కోరుతూ తితిదే మే 12న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖకు ఆమోదం తెలిపిన సర్కార్‌ పలు సూచనలు చేసింది. భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలని, స్థానికులు, తితిదే ఉద్యోగులతో ప్రయోగాత్మకంగా దర్శనాలు ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

భక్తులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు

దేశ నలుమూలల నుంచి తరలివచ్చే అశేష భక్తజనంతో కిక్కిరిసిపోయే తిరుగిరులు.... మార్చి 20 నుంచి నిర్మానుష్యంగా మారాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు తిరుమల ఆలయలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపేశారు. తిరుమల చేరుకొనే కాలినడక మార్గాలు, రహదారులు మూసివేశారు. ఆ తర్వాత లాక్‌డౌన్‌ విధించడంతో దర్శానాలు తిరిగి ప్రారంభంకాలేదు. తాజాగా ఐదో విడత లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్రం.... ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు సడలింపులు ఇచ్చింది. ఫలితంగా మళ్లీ వెంకటేశ్వరుడిని కళ్లారా చూసుకునే అవకాశం కలిగింది. తిరిగి దర్శనాలు పునురుద్ధరించిన తితిదే.... వైరస్‌ వ్యాప్తి చెందకుండా భక్తులు భౌతికదూరం పాటించేలా క్యూలైన్లలో తగిన ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లలో ఒక్కో భక్తుడి మధ్య ఆరు అడుగులు ఉండేలా ప్రత్యేక ఇనుప కమ్మీలు అమర్చడంతో పాటు.... దూరాన్ని నిర్దేశిస్తూ గీతలు గీశారు. ప్రయోగాత్మకంగా తితిదే ఉద్యోగులు, తిరుమల వాసులతో దర్శనాలు ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది.
 

గంటకు 300మందికే స్వామివారి దర్శనం

నూతన మార్గదర్శకాల ప్రకారం ఆలయాల్లోకి గంటకు మూడు వందల మంది భక్తులను అనుమతించాలని రాష్ట్ర దేవదాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీనికి అనుగుణంగా ఎన్నిగంటల పాటు భక్తులను అనుమతించాలన్న దానిపై తితిదే ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. రోజుకు 14 నుంచి 15 గంటల పాటు శ్రీవారి దర్శనానికి అనుమతించడానికి ప్రణాళిక రూపొందిస్తోంది. 

ఇదీ చదవండి:

శ్రీశైల ఆలయ కుంభకోణం: 24 మంది అరెస్ట్

Last Updated : Jun 2, 2020, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details