AB VENKATESWARA RAO: ఐపీఎస్ సీనియర్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీ సర్వీసు పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని సూచించింది.
ఏబీవీని రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 8న సస్పెండ్ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ... ప్రభుత్వం అప్పట్లో చర్యలు తీసుకుంది. ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఏబీవీ సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
ఏబీవీ సస్పెన్షన్ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 7తో ముగిసినందున ఇకపై సస్పెన్షన్ చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఏబీవీ సర్వీసులో ఉన్నట్లు గుర్తించి ఆయనకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు కల్పించాలని పేర్కొంది. సుప్రీం ఆదేశాలతో...ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.